
‘ఎనిమి’ ఆస్తుల లెక్క తేల్చండి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎనిమి ఆస్తుల (కస్టోడియన్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా (సెపీ) సంరక్షణలోని శత్రు ఆస్తుల) లెక్క మార్చిలోగా పక్కాగా తేల్చాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శనివారం హోటల్ టూరిజం ప్లాజాలో సీసీఎల్‌ఏ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణరెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్, వికారాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కొత్వాల్‌గూడలో 600 ఎకరాలకుపైగా, మియాపూర్‌లో 291 ఎకరాలకుపైగా ఉన్న ఎనిమి ప్రాపర్టీస్‌పై పురోగతి ఏమిటి అని కలెక్టర్ నారాయణరెడ్డిని ప్రశ్నించారు. మార్చిలోగా సర్వే పూర్తి చేసి, సమగ్ర వివరాలు సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ భూములను కాపాడాల్సిందే..
హైదరాబాద్ జిల్లా బాకారంలో 25,503 గజాల వివాదాస్పద స్థలంలో ఎనిమి ప్రాపర్టీస్ వాటా కింద ఉన్న 5,578 గజాలు, బహుదుర్‌పురాలోని రికాబ్‌గంజ్‌లోని 710,724,778,784 సర్వే నంబర్లలో ఉన్న 3,300 గజాలు, కొత్తగూడెం పాల్వంచలోని సర్వే నంబర్లు 126/111, 126/112లోని 40 ఎకరాలు, వికారాబాద్ జిల్లా అల్లంపల్లి సర్వే నంబర్లు 426, 427, 428లో 17.22 ఎకరాలు ఎనిమి ప్రాపర్టీస్ ఉన్నట్లు రికార్డులు ఉన్నాయని అన్నారు. సెపీ అధికారులతో కలిసి జిల్లా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి సెక్షన్ 8ఏ ప్రకారం వివాదాలను పరిష్కరించాలని సూచించారు. హైదరాబాద్ సహా రంగారెడ్డి ఇతర జిల్లాల్లోని ఎనిమి ఆస్తులు ఇప్పటికే పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయినట్లు ఆయా జిల్లాల అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వాటిని కాపాడి తీరాల్సిందేనని మంత్రి ఆదేశించారు.
ఎనిమి ప్రాపర్టీస్ అంటే?
1962లో చైనీస్ దండయాత్ర, 1965 నుంచి 1971 వరకు జరిగిన ఇండో–పాక్ యుద్ధం అనంతరం భారత్ నుంచి వెళ్లిపోయి పాకిస్తాన్, చైనాలో స్థిరపడి ఆయా దేశాల పౌరసత్వం తీసుకున్న వ్యక్తులకు సంబంధించి భారత్‌లో ఉన్న ఆస్తులను శత్రు (ఎనిమి ప్రాపర్టీ) ఆస్తులుగా ప్రభుత్వం గుర్తించింది. వీటి సంరక్షణ బాధ్యతలను సెపీకి అప్పగించింది. తెలంగాణ, ఏపీతోపాటు దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాదాపు 13 వేల వరకు శత్రు ఆస్తులున్నట్లు కేంద్రం వద్ద రికార్డులున్నాయి. వీటి మార్కెట్ విలువ రూ.వేల కోట్లు ఉన్నట్లు గుర్తించింది. ఎనిమి ప్రాపర్టీ చట్టంలోని సెక్షన్ 8 (ఏ) ప్రకారం ఈ ఆస్తులను విక్రయించే అధికారం కేంద్రానికి ఉంది. నాటి నుంచి నేటి వరకు ఈ ఆస్తులు చాలా చోట్ల అన్యాక్రాంతమయ్యాయి. మరికొన్ని ఆస్తులకు సంబంధించి న్యాయ వివాదాలు నడుస్తున్నాయి. ఆస్తుల వివాదాల పరిష్కారంపై బండి సంజయ్ సమీక్ష నిర్వహించారు.
మార్చిలోగా సర్వే పూర్తి చేయండి
సమగ్ర వివరాలు సమర్పించండి
కేంద్ర మంత్రి బండి సంజయ్
Comments
Please login to add a commentAdd a comment