పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: త్వరలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్, పదో తరగతి వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లో ఆయా విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 5 నుంచి 25 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు, ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు టెన్త్ పరీక్షలు ఉన్నట్లు తెలిపారు. ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి మొత్తం 1,47,211 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారని, వీరి కోసం 185 కేంద్రాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. టెన్త్‌లో 51,749 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానుండగా, వీరి కోసం 249 కేంద్రాలను ఎంపిక చేసినట్లు వివరించారు. ఒక్కో పరీక్ష కేంద్రానికి ఒక్కో సిట్టింగ్ స్క్వాడ్ సహా చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారులను నియమించినట్టు తె లిపారు. ఎంపిక చేసిన రూట్లలో రూట్ అధికారులను కేటాయించామని వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లను అనుమతించకూడదన్నారు.
కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. పరీక్షలు జరిగే సమయంలో ఆయా కేంద్రాల వద్ద ఉన్న జిరాక్స్ సెంటర్లను ముందే మూసివేయించాలని, పరీక్ష కేంద్రాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని, నిరంతర విద్యుత్, తాగునీరు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రశ్నపత్రాలను పోలీస్ ఎస్కార్ట్‌తో ప్రభుత్వ వాహనంలో పరీక్ష కేంద్రాలకు తరలించాలన్నారు. విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్, పెన్, పెన్సిల్, రబ్బర్, హల్ టికెట్లను మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలని సూచించారు. ప్రతి సెంటర్‌కు ఇద్దరు కానిస్టేబుళ్లతో తప్పక బందోబస్తు నిర్వహించాలన్నారు. వేసవి దృష్ట్యా అన్ని కేంద్రాల్లో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు సత్వర వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సహా మందులు, ఆశా వర్కర్లను అందుబాటులో ఉంచాలన్నారు. మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా బస్సు సౌకర్యం కల్పించాలని, విద్యార్థులకోసం ఇంటర్మీడియెట్, టెన్త్ ఎగ్జామ్స్ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు కలెక్టర్ సూచించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలన్నారు. సమావేశంలో కందుకూర్ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్ రెడ్డి, చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి వెంక్యా నాయక్, విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ అధికారులు, పోస్టల్, ఆర్టీసీ, విద్యుత్, మెడికల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూములపై మరింత నిఘా
ప్రభుత్వ భూములపై మరింత నిఘా ఏర్పాటు చేయాలని, భూముల పరిరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా 15 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లో సెక్షన్ సూపరింటెండెంట్స్, ఆర్డీఓలు, తహసీల్దార్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి అధికారులదేనని స్పష్టం చేశారు. ఇందు కోసం రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే లాండ్స్, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, డివిజన్ల వారీగా ప్రభుత్వ భూములను గుర్తించాలని అన్నారు. ఆయా భూముల చుట్టూ రాతి కడీలను నాటడంతో పాటు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి, సమగ్ర నివేదికను రూపొందించాలన్నారు. ప్రతి ఒక్కరూ సమష్టి బాధ్యతగా పని చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులన్నింటినీ ఈనెల 15వ తేదీలోగా పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్ రెడ్డి, చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, మండల తహశీల్దారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఇంటర్, టెన్త్ ఎగ్జామ్స్ పక్కాగా నిర్వహించాలి
ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దు
విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలి
సమీక్ష సమావేశంలో కలెక్టర్ నారాయణరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment