
సిబ్బంది నిర్లక్ష్యం.. నీరుగారుతున్న లక్ష్యం
ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం
అస్తవ్యస్తంగా టీకాల కార్యక్రమం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం.. కొంత మంది సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం అభాసుపాలవుతోంది. జాతీయ వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు సహా చిన్నారులకు వివిధ రకాల వ్యాక్సిన్లు ఉచితంగా సరఫరా చేస్తోంది. ప్రతి బుధ, శనివారాల్లో ఎంపిక చేసిన ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ఏఎన్‌ఎంలు చేరుకుని అక్కడికి వచ్చిన చిన్నారులకు వ్యాక్సినేషన్ చేయాల్సి ఉంది. కొంత మంది సిబ్బంది ఈ కార్యక్రమాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు.
గర్భిణులు, బాలింతలు, శిశువులకు ఇవ్వాల్సిన టీకాలు.. రోడ్డుపై, చెత్త కుప్పల్లో దర్శనమిస్తున్నాయి. టార్గెట్ కోసం పిల్లలకు టీకాలు వేయకపోయినా వేసినట్లు తప్పుడు రికార్డులు నమోదు చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు టీకాల సరఫరా, నిల్వ, వినియోగంపై ఆరా తీయాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో రూ.లక్షల విలువ చేసే టీకాలు రోడ్డు పాలవుతున్నాయి.
కొరవడిన నిఘా
గర్భిణులకు నాలుగు, ఐదో నెలలో టీడీ వ్యాక్సిన్ (టెటనస్ అండ్ డిప్తీరియా) రెండు డోసులు ఇస్తారు. వీటితో పాటు ఐరన్, క్యాల్షియం మందులను మూడు నెలల పాటు ఉచితంగా సరఫరా చేస్తారు. ప్రసవ సమయంలో బాలింతలు అధిక రక్తస్రావంతో బాధపడుతుంటారు. వీరికి ఐరన్, క్యాల్షియం టాబ్లెట్లను సరఫరా చేస్తారు. కోరింత దగ్గు, కంఠసర్పి, ధనుర్వాతం, పోలియో, కామెర్లు, మెదడువాపు, నిమోనియా వంటి జబ్బుల బారిన పడకుండా ప్రభుత్వం పుట్టిన ప్రతి శిశువుకు జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా ఆయా టీకాలను ఉచితంగా ఇస్తోంది.
బుధవారం ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రాల్లో, శనివారం కమ్యూనిటీ హాళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పుట్టిన వెంటనే బీసీజీ, హెపటైటిస్ బి, పోలియో చుక్కలు, రోటా ఓరల్ డ్రాప్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 45 రోజులకు పెంటా వాక్సిన్‌తో పాటు పోలియో, ఐపీవీ ఫస్ట్ డోసు, రోటా ఓరల్ డ్రాప్స్ ఇస్తారు. శిశువు వయసు రెండున్నర నెలలకు చేరుకున్న తర్వాత పెంటా రెండో డోసు, పోలియో రెండో డోసు సహా రోటా ఓరల్ డ్రాప్స్ ఇవ్వాల్సి ఉంది.
ఇక మూడున్నర నెలలకు పెంటా మూడో డోసు, ఓపీవీ మూడో డోసు, ఐపీవీ రెండో డోసు ఇవ్వాలి. పదో నెలలో ఎంఆర్ ఫస్ట్ డోసు, 16 నుంచి 18 నెలలకు ఎంఆర్ రెండో డోసు సహా విటమిన్ ‘ఎ’ ద్రావణం తాగించాలి. ఐదేళ్లకు డీటీటీ, పదేళ్లకు టీడీ ఫస్ట్ డోసు, 16 ఏళ్లకు టీడీ సెకండ్ డోసు ఇవ్వాల్సి ఉంది. అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యంతో మెజార్టీ పిల్లలకు మొత్తం టీకాలు అందకుండా పోతున్నాయి.
డిప్తీరియా గుప్పిట్లో చిన్నారులు
నిజానికి టీకాలను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోంది. ఫార్మా కంపెనీల నుంచి కొనుగోలు చేసిన ఈ వ్యాక్సిన్లను ముందు సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో నిల్వ చేస్తుంది. జిల్లాల నుంచి అందిన ఇండెంట్ల ఆధారంగా వ్యాక్సిన్లు సరఫరా చేస్తుంది. మొదటగా జిల్లా డీఎంహెచ్ ఆఫీసులోని నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్ చేరుతుంది. అటు నుంచి క్షేత్రస్థాయి నుంచి వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా ఆయా ఆస్పత్రుల్లోని ఫార్మాసీలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తుంటారు. అటు నుంచి ఏరియాల వారీగా ఏఎన్‌ఎంలకు అందజేస్తుంటారు. బీసీజీ, మిజిల్స్ వ్యాక్సిన్ బాటిల్ ఓపెన్ చేసిన నాలుగు గంటల్లోనే వాడాలి.
తర్వాత అది పనికి రాకుండా పోతోంది. అదే పెంటా, టీటీ వ్యాక్సిన్లు, పోలియో చుక్కలు 28 రోజుల వరకు వినియోగించుకునే అవకాశం ఉంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు సబ్ సెంటర్ల వారీగా ప్రత్యేక సూపర్ వైజర్లను సైతం నియమించారు. ఏ సెంటర్‌లో.. ఏ రోజు.. ఎంత మందికి వ్యాక్సిన్ వేయించుకున్నారు, ఎన్ని వాయిల్స్ వినియోగించారు, మిగిలిన బాటిళ్లను ఎక్కడ నిల్వ చేశారు, ఖాళీ బాటిల్స్ ఎక్కడ భద్రపరిచారు, టీకా వేసిన తర్వాత ఎమైనా రీయాక్షన్స్ వచ్చాయా వంటి అంశాలపై సూపర్ వైజర్లు ఆరా తీయాల్సి ఉంది.
మెజార్టీ సూపర్ వైజర్లు దీన్ని పట్టించుకోవడం లేదు. ఫలితంగా బాలాపూర్, పహడీషరీఫ్, జల్ పల్లి, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లోని చిన్నారులు డిప్తీరియా, మెదడువాపు, కామెర్ల వంటి జబ్బుల బారిన పడుతున్నట్లు తెలిసింది.
నిర్లక్ష్యాన్ని సహించం
టీకాలను పడేసిన అంశంపై సమగ్ర విచారణకు ఆదేశించాం. ఏ సెంటర్‌కు ఎంత వాక్సిన్ సరఫరా చేశారు.. ఇప్పటి వరకు ఎంత మందికి వ్యాక్సిన్ వేశారు.. మిగిలిన వ్యాక్సిన్ ఎక్కడ నిల్వ చేశారు.. వంటి అంశాలపై ఆరా తీస్తాం. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ వెంకటేశ్వర్‌రావు, జిల్లా వైద్యాధికారి

టీకా.. ఇవ్వలేక!

మీర్‌పేటలోని ఓ సబ్‌సెంటర్ వద్ద బయట పడేసిన విలువైన వ్యాక్సిన్లు
Comments
Please login to add a commentAdd a comment