
మాది ప్రోత్సాహం
మీది సాయం..
రోడ్డు ప్రమాదంలో గాయపడి సమయానికి సరైన వైద్యం అందక ఎన్నో ప్రాణాలు పోతున్నాయి.. ఘటన జరిగినప్పుడు కేసులు.. పోలీసులుమా కెందుకీ పంచాయితీ అనుకుని చాలామంది చూస్తూ వెళ్తున్నారే తప్ప సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.. ఇలాంటి సమయాల్లో క్షతగాత్రులను తక్షణమే ఆస్పత్రుల్లో చేర్చండి.. మీకు మేమున్నాం అంటూ భరోసా కల్పిస్తోంది కేంద్రం.. ప్రోత్సహించడంతోపాటు ప్రోత్సాహకం అందిస్తోంది.
ఇబ్రహీంపట్నం రూరల్: రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2021లో గుడ్ సమరిటన్ పథకానికి శ్రీకారం చుట్టింది. జాతీయ స్థాయి అవార్డులకు అవకాశంతో పాటు రూ.5వేల నగదు, ప్రశంసాపత్రం అందిస్తోంది. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తీసుకెళ్తే కేసు, పోలీసుల పంచాయితీ ఉంటుందని గతంలో చాలామంది సాయం చేయాలనుకున్నా వెనునకాడేవారు. ప్రస్తుతం అవగాహన పెరగడంతో పాటు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. 108 వాహనం అందుబాటులో లేకపోతే తమ వాహనంలో, ఇతర వాహనాల్లో ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్చుతున్నారు. గుడ్ సమరిటన్ పథకం ద్వారా ఇలాంటి వారికి ప్రోత్సాహం లభిస్తోంది.
ఆస్పత్రులకు తరలించి..
ప్రాణాలను నిలబెట్టి
సకాలంలో వైద్యం అందక రోడ్డు ప్రమాద బాధితుల్లో దాదాపు 50 శాతం మృతి చెందుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరు సాయం చేయకపోగా సంఘటనా స్థలంలో క్షతగాత్రులను వీడియో, ఫొటోలు తీసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. సమరిటన్ పథకం అందరినీ సాయం చేసేలా ప్రోత్సహిస్తోంది. మారుమూల ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు 108 అంబులెన్స్ రావడం సైతం ఇబ్బందికరంగా మారుతోంది. అలాంటి సమయాల్లో చాలామంది ఆటోలు, ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్తున్నారు. సరైన సమయంలో ఆస్పత్రులకు తరిలించడం ద్వారా ప్రాణాలను నిలబెడుతున్నారు.
ప్రశంసలతోపాటు నగదు ప్రోత్సాహకం
ప్రమాదం జరిగిన గంటలోగా ఆస్పత్రికి తీసుకొస్తే ప్రాణాపాయం నుంచి కాపాడొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీన్నే గోల్డెన్ అవర్‌గా పేర్కొంటున్నారు. ఇప్పుడు కేంద్రం ప్రకటించిన సమరిటన్ తో గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రిలో చేర్చిన వారికి రూ.5 వేలు అందనున్నాయి. ఇందుకు దరఖాస్తు చేసుకోవాలంటే పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓలు లెటర్ ప్యాడ్‌పై వివరాలు రాసి ఇవ్వాల్సి ఉంటుంది. పోలీసులు కూడా కేసుతో సంబంధం లేకుండా రాసివ్వాలని నిబంధనల్లో పేర్కొన్నారు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ జత చేస్తే నేరుగా వారి ఖాతాలో నగదు జమ అవుతుంది. ప్రశంసాపత్రం కూడా అందుతుంది. సంవత్సరానికి గరిష్టంగా ఐదు అవార్డులు ఇస్తారు. అత్యంత విలువైన మంచి సహాయకులకు ఒక్కొక్కరికి రూ.లక్ష నగదు, జాతీయ స్థాయి అవార్డులు సైతం ఇస్తారు. అత్యవసర పరిస్థితుల్లో రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేయడానికి ప్రజలను ప్రేరేపించడం.. చట్టపరమైన పరిణామాలకు భయపడకుండా సాయం చేసే సంస్కృతిని పెంపొందించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకంపై సమగ్రంగా ప్రచారం చేసి అవగాహన కల్పిస్తే .. మరింత మంది ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఆపద్బాంధవులకు కేంద్రం భరోసా
క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రులకు తరలించండి
గుడ్ సమరిటన్ పథకంతో గుర్తిస్తాం
రూ.5వేలు ప్రోత్సాహకం.. ప్రశంసా పత్రం
ప్రజలను చైతన్యం చేస్తాం
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన గుడ్ సమరిటన్ పథకంపై ప్రజలను చైతన్యం చేస్తాం. అవగాహన సమావేశాలు నిర్వహించేలా స్థానిక పోలీసులకు, వివిధ శాఖల అధికారులకు సూచిస్తాం. గాయపడ్డ వారిని ఆస్పత్రిలో చేర్పిస్తే గుర్తింపు లభిస్తుంది. దాంతో పాటు ఆర్థిక సహకారం అందుతుంది. ప్రభుత్వాలు గుర్తిస్తాయి.
– కేపీవీ రాజు, ఏసీపీ, ఇబ్రహీంపట్నం

మాది ప్రోత్సాహం