అఘోరీకి 14 రోజుల రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

అఘోరీకి 14 రోజుల రిమాండ్‌

Published Thu, Apr 24 2025 8:43 AM | Last Updated on Thu, Apr 24 2025 8:43 AM

అఘోరీకి 14 రోజుల రిమాండ్‌

అఘోరీకి 14 రోజుల రిమాండ్‌

చేవెళ్ల/శంకర్‌పల్లి: అఘోరీ అలియాస్‌ శ్రీనివాస్‌ను అరెస్టు చేసిన మోకిల పోలీసులు బుధవారం చేవెళ్ల కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించింది. పూజల పేరుతో అఘోరీ తనను మోసం చేసిందని, చంపుతానని బెదిరించి రూ.9.80 లక్షలు తీసుకుందని శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూర్‌ శివారులోని ప్రగతి రిసార్ట్స్‌లో నివాసముండే ఓ మహిళా సినీ నిర్మాత ఈఏడాది ఫిబ్రవరి 25న మోకిల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీఎన్‌ఎస్‌ 308(5),318(1),351(3),352 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, గత మంగళవారం ఉత్తర్‌ప్రదేశ్‌లో అఘోరీని అరెస్టు చేసి, తీసుకువచ్చారు. నార్సింగి ఏసీపీ కార్యాలయం నుంచి బుధవారం పోలీస్‌ వాహనంలో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, సాధారణ వైద్య పరీక్షలు చేయించి, చేవెళ్ల జూనియర్‌ ఫస్ట్‌క్లాస్‌ జడ్జి ధీరజ్‌కుమార్‌ ఎదుట హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్‌ విధించారు.

రిమాండ్‌ సమయంలో హైడ్రామా

న్యాయమూర్తి ఆదేశాల మేరకు మోకిల పోలీసులు అఘోరీని సంగారెడ్డి జిల్లా కంది జైలు అధికారులకు అప్పగించి వెళ్లారు. అయితే అఘోరీని ఏ బ్యారక్‌లో ఉంచాలనే సందేహం రావడంతో, వారు మళ్లీ మోకిల పోలీసులను పిలిపించారు. దీంతో అఘోరీని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు. మహిళ అని గుర్తించిన తర్వాత చంచల్‌గూడ జైలుకు తరలించారు. అరెస్టు సమయంలో అఘోరీ నుంచి రూ. 5,500 నగదు, నేరాలకు ఉపయోగించిన ఐ20 కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సులభంగా డబ్బు కోసమే..

తనను తాను అఘోరీ మాతగా ప్రకటించుకుని రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీనివాస్‌(28) చిన్ననాటి నుంచి అబ్బాయిగానే ఉన్నాడు. ఆతర్వాత సులభంగా డబ్బు సంపాదించడంతో పాటు ఇతర కారణాలతో చైన్నె, ఇండోర్‌లో లింగ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయించుకున్నాడు. అనంతరం ఆధ్యాత్మిక వేషధారణలో కనిపిస్తూ, తంత్ర పూజలు అంటూ అమాయకులను మోసం చేస్తూ ఆర్థికంగా లబ్ధి పొందుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

పోలీసులు, కోర్డులకు సహకరిస్తా..

చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని పోలీసులు, కోర్టులకు పూర్తిగా సహకరిస్తానని అఘోరీ తెలిపారు. జడ్జి ముందు హాజరైన సమయంలో తనకు లాయర్‌ను పెట్టుకునే స్తోమత లేదని, ప్రభుత్వ అడ్వకేట్‌ను ఏర్పాటు చేయాలని అఘోరీ కోరినట్లు తెలిసింది. అరెస్ట్‌, కస్టడీ నేపథ్యంలో కోర్టులో ఎలాంటి వాదనలు జరగలేదని సమాచారం. అఘోరీ అభ్యర్థన మేరకు న్యాయమూర్తి ఈ కేసును లీగలేయర్‌ కౌన్సిల్‌కు అప్పగించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలుసుకుని కేసును ముందుకు తీసుకెళ్తానని ఆయన తెలిపారు.

చేవెళ్ల కోర్టులో హాజరు పర్చిన పోలీసులు

లింగ నిర్ధారణ పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలింపు

హోమ్‌కు శ్రీవర్షిణి..

అఘోరీతో పాటు శ్రీవర్షిణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మోకిల పీఎస్‌లో ఆమెకు కౌన్సెలింగ్‌ ఇప్పించారు. అనంతరం నగరంలోని హైదర్షాకోట్‌ కస్తూర్బాగాంధీ వెల్ఫేర్‌ హోమ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement