
పరుపుల కంపెనీలో అగ్ని ప్రమాదం
పహాడీషరీఫ్: ఓ పరుపుల తయారీ కంపెనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జనావాసాల నడుమ చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో రంజాన్ వేళ స్థానికులు భయకంపితులయ్యారు. పోలీసులు, స్థానికుల కథ నం ప్రకారం.. జల్‌పల్లి గ్రామంలోని ప్రధాన రహదారిపై ఉన్న ఖాజా బేకరీ గల్లీలో చార్మినార్ ప్రాంతానికి చెందిన మహమూద్ కొన్నాళ్లుగా పరుపుల తయారీ పరిశ్రమను నిర్వహిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు వ్యాపించి పరుపులకు అంటుకున్నాయి. చూస్తుండగానే దట్టమైన పొగలు రావడంతో అందులో ఉన్న సిబ్బంది ప్రాణభయంతో బయటికి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన గోడౌన్‌లో సిలిండర్ ఉండడం.. చుట్టూ నివాసాలు ఉండడంతో తమకు ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనని స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. దాదాపు 50 నిమిషాల తర్వాత అక్కడికి చేరుకున్న ఫైరింజన్ మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఫైర్ సిబ్బంది సిలిండర్‌ను బయటికి తేవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందనందున కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.
వ్యాపించిన దట్టమైన పొగలు
రంజాన్ వేళ భయకంపితులైన స్థానికులు
మంటలు అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది

పరుపుల కంపెనీలో అగ్ని ప్రమాదం