
పేదల ఇంటి స్థలాలకు విముక్తి కల్పించాలి
ఇబ్రహీంపట్నం: రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం కబ్జాలో ఉన్న పేదల ఇంటి స్థలాలకు రేవంత్ సర్కార్ విముక్తి కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశారు. ఇంటి స్థలాల బాధితులతో బుధవారం మండల పరిధిలోని రాయపోల్ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేదలకు 60 గజాల చొప్పున 600 మందికి పంపిణీ చేశారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో లక్ష నాగళ్లతో రామోజీ ఫిలిం సిటీని దున్ని పేద ప్రజలకు భూములను పంచుతానన్న కేసీఆర్... పదేళ్ల కాలంలో కనీసం పేదల ఇంటి స్థలాలను విడిపించలేకపోయారని విమర్శించారు. ప్రజా సర్కార్ అని చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేదలకు ఇంటి స్థలాలు దక్కేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎ.రవీంద్రచారి మాట్లాడుతూ.. ఫిలింసిటీ కబ్జాలోని ఇంటి స్థలాలను లబ్ధిదారులకు ఇవ్వకుంటే వేలాది మంది పేదలతో గుడిసెలు వేయించి మరో భూపోరాటానికి దిగుతామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కావాలి నర్సింహ, ముత్యాల యాదిరెడ్డి, పొచమోని నీలమ్మ, మొలుగు నర్సింహ, శివరాల లక్ష్మయ్య, నర్సింహ, శ్రీహరి, అంజయ్య, సీతయ్య పాల్గొన్నారు.