
యువతలో నైపుణ్యాన్ని వెలికితీయాలి
రాయదుర్గం: తెలంగాణలోని యువతలో నైపుణ్యాన్ని వెలికితీసి వారిని ఉత్తమ మానవ వనరులుగా తీర్చిదిద్దుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. గచ్చిబౌలి లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా క్యాంపస్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోనే అత్యుత్తమ నైపుణ్య మానవ వనరులకు చిరునామాగా రాష్ట్రాన్ని మార్చాలనే సంకల్పంతోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ యువతకు కొదవ లేదని, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ అందిస్తే మరింత మెరుగ్గా తయారవుతారన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు సాఫ్ట్ స్కిల్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని ప్రముఖ విద్యా, పరిశోధన, టాస్క్, డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ)తదితర సంస్థలతో సమన్వయం చేసుకోవాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో ఐటీ శాఖా ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్, డిప్యూటీ సెక్రెటరీ భవేష్‌మిశ్రా, స్కిల్ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ సుబ్బారావు, ఔస్‌డీ చమాన్ మెహతా తదితరులు పాల్గొన్నారు.