
గోవిందుడికి గోప వాహన సేవ
వైభవంగా కొనసాగుతున్న చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
మొయినాబాద్: చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీవారు గోప వాహన, హనుమంత వాహన సేవలు అందుకున్నారు. స్వామివారిని మొదటగా గోప వాహనంపై ఆశీనులను చేసి ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం నిర్వహించిన హనుమంత వాహన సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపారాయణం, పూజలు, మంగళహారతి సేవలు అందించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాల కృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్, తిరుమల కిరణాచారి, నరసింహన్, కిట్టు, కృష్ణమూర్తి, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
నేడు కల్యాణం
బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారికి సూర్యప్రభ, గరుడ వాహన సేవలు నిర్వహించనున్నారు. రాత్రి 11 గంటలకు ఆలయ ప్రాంగణంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు.