
చేప.. వలకు చిక్కదే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సాధారణంగా చెరువులో వదిలిన చేపపిల్ల (35–40 ఎంఎం సైజు) కిలో బరువు పెరగాలంటే కనీసం పది నెలలు పడుతుంది. చెరువుల్లో వీటిని వదిలి ఆరు మాసాలు కూడా దాటలేదు. ఇప్పటికే మెజార్టీ చెరువులు/కుంటలు ఎండిపోయాయి. అక్కడక్కడా ఒకటి రెండు చెరువుల్లో కొద్దిపాటి నీరు కన్పిస్తున్నా.. పూర్తిగా కలుషితమై ప్రమాదకరమైన బ్యాక్టీరియా, ఫంగస్‌తో నిండిపోయాయి. సాధారణంగా వేసవిలో చెరువులోని నీరు దగ్గర పడిందని భావించి మత్య్సకారులు వల విసిరితే.. ఒక్క చేప కూడా చిక్కడం లేదు. రూ.లక్షలు వెచ్చించి.. పోసిన చేపపిల్లలు వలకు చిక్కకపోవడం ఏమిటీ? అన్న ప్రశ్న జిల్లాలోని మత్స్యకారుల మదిని తొలిచివేస్తోంది. ఇదిలా ఉంటే ఏటా ఐదు వేల టన్నుల చేపల దిగుబడి వస్తున్నట్లు జిల్లా మత్స్యశాఖ లెక్కలు చెప్పుతుండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఉపాధి కల్పించాలని..
జిల్లాలో 121 మత్స్యకార సొసైటీలు ఉండగా, వీటిలో సుమారు ఏడు వేల మంది సభ్యులుగా ఉన్నారు. వీరికి ఏడాదంతా జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని తీసుకొచ్చింది. మొత్తం 2,132 చెరువుల పరిధిలో 70.067 ఎకరాల ఆయకట్టు ఉంది. గత ఏడేళ్లుగా ప్రభుత్వం ఆయా చెరువులు, కుంటల్లో ఉచితంగా చేప పిల్లల్ని వదులుతున్న విషయం విదితమే. 2022లో 780 చెరువుల్లో రూ.1.30 కోట్ల విలువ చేసే సుమారు 1.80 కోట్ల చేపపిల్లలను వదలగా, 2023లో 794 చెరువుల్లో 1.96 కోట్ల చేపపిల్లలను వదిలారు. 2024 అక్టోబర్/నవంబర్‌లో 700 చెరువుల్లో 1.20 కోట్ల చేపపిల్లలను వదిలారు. తూర్పుగోదావరి, కై కలూరు, సూర్యపేట జిల్లాలకు చెందిన సీడ్ వ్యాపారులు చేపపిల్లలను సరఫరా చేశారు. 80 నుంచి 100 ఎంఎం సైజు బొచ్చ, రవ్వ, మోసు రకం చేపపిల్లలతో పాటు 35 నుంచి 40 ఎంఎం సైజు బొచ్చ, రవ్వ, బంగారు తీగ చేపపిల్లలను సరఫరా చేశారు.
వృత్తిదారులకు చేదు అనుభవం
ఎంపిక చేసిన 20 పెద్ద చెరువుల్లో 80–100 ఎంఎం సైజు చేపపిల్లలను వదలగా, మిగిలిన వాటిల్లో ఇతర సైజు పిల్లలను వదిలారు. నిర్ధేశించిన చేపపిల్లలు కాకుండా నాసిరకం చేపపిల్లలను సరఫరా చేయడం, ఒక్కో ప్యాకెట్‌లో 1800 చేప పిల్లలకు 750కి మించి లేకపోవడం, పారిశ్రామిక వ్యర్థాలకు తోడు సమీప పట్టణాల్లోని మురుగునీరు వచ్చి ఆయా చెరువుల్లో చేరడం, చెరువులు/కుంటలు మురికి కూపాలుగా మారడం, ఆయా చెరువుల్లో ప్రమాదకర మైన బ్యాక్టీరియా, ఫంగస్ నిండిపోవడం, ఆశించిన స్థాయిలో నీరు లేకపోవడం వెరసి వేసిన పిల్ల వేసినట్లే కన్పించకుండా పోయింది. చెరువుల్లో నీరు దగ్గరపడటంతో చేపలు పట్టి జీవనోపాధి పొందాలని భావించిన వృత్తిదారులకు చేదు అనుభవమే ఎదురవుతోంది. వలకు బొచ్చ, బంగారు తీగ, రవ్వకు బదులు బురుకలు(పాంప్లేట్స్) చిక్కుతుండటం, మార్కెట్లో వాటికి పెద్దగా డిమాండ్ కూడా లేకపోవడంతో నష్టాలను చవిచూడాల్సి వస్తోంది.
700 చెరువుల్లో 1.20 కోట్ల చేప పిల్లలను వదిలిన ప్రభుత్వం
ఫంగస్, బ్యాక్టీరియా..పరిశ్రమలవ్యర్థాలతో నిండిన చెరువులు
ఎదుగుదల లేక కనిపించని చేపలు
చేప పిల్లల పంపిణీ ఇలా
సంవత్సరం చెరువులు చేపపిల్లలు బడ్జెట్
2017–18 280 99.74 లక్షలు రూ.62,41,039
2018–19 72 27.69 లక్షలు రూ.21,54,180
2019–20 327 70.50 లక్షలు రూ.41,31,002
2020–21 578 1.29 కోట్లు రూ.70,23,773
2021–22 794 1.60 కోట్లు రూ.1.25 కోటు
2022–23 794 1.80 కోట్లు రూ.1.30 కోట్లు
2023–24 800 1.96 కోట్లు రూ.1.33 కోట్లు
2024–25 700 1.20 కోట్లు రూ.92 లక్షలు