
రైతు నెత్తిన.. విత్తన భారం
షాబాద్: పత్తి రైతుపై ధరల పిడుగు పడింది. రానున్న వర్షాకాలం ప్రారంభానికి ముందే విత్తన కంపెనీలు అమాంతం ధరలు పెంచేశాయి. దీంతో ఇప్పటికే అతివృష్టి, అనావృష్టితో నష్టాలు చవిచూస్తున్న రైతులపై ఆర్థిక భారం మరింత పడనుంది. దీంతో పత్తి సాగువైపు ఈసారి రైతులు మొగ్గు చూపుతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు పెరుగుతున్న ధరలు.. మరోవైపు నకిలీ విత్తనాల బెడద కంటికి కునుకు లేకుండా చేస్తోంది.
ఏటా ధరల దడ
ఏటా పత్తి సాగుకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. విత్తనాలు, పురుగు మందులకు రూ.వేలల్లో వెచ్చించాల్సి వస్తోంది. దీనికి తోడు కూలీల ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఎకరాకు రూ.15వేల నుంచి రూ.20 వేల వరకు కలుపుతీత కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది. విత్తన కంపెనీలు ఏటా ధరలు పెంచుతుండడంతో మరింత భారం పడుతోంది. బీటీ పత్తి విత్తనాల ధర ఆరేళ్లుగా పెరుగుతూ వస్తోంది. 2019లో ప్యాకెట్ ధర రూ.710 ఉండగా ప్రస్తుతం రూ.901కి చేరింది.
తగ్గుతున్న పంట దిగుబడి
పత్తి పంట వేసిన నాటి నుంచి చేతికొచ్చే వరకు రైతులకు ఆందోళన తప్పడం లేదు. సరైన సమయానికి వర్షాలు పడకపోవడం.. పూత, కాత సమయంలో ఎక్కువగా పడటం తదితర కారణాలతో పంట దిగుబడులపై ప్రభావం చూపుతోంది. చేతికొచ్చిన పంట తీసే సమయంలో కూలీలు దొరక్క నేల రాలి దిగుబడి తక్కువగా వస్తోంది.
పెరుగుతున్న పెట్టుబడి
పత్తి పంట సాగు చేసేందుకు ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేల ఖర్చు వస్తోంది. దుక్కి దున్నడం నాటి నుంచి భూమిని చదును చేయడం, విత్తనాలు వేయడం, కలుపు, మందుల పిచికారీ, పత్తి తీత కూలీ ఖర్చులు ఉంటాయి. ఎకరాకు రెండు ప్యాకెట్ల విత్తనాలు అవసరం ఉంటుందని రైతులు చెబుతున్నారు. గతేడాది బీటీ–2 పత్తి విత్తనం 475 గ్రాముల ప్యాకెట్ ధర రూ.867 ఉండగా ఈ ఏడాది రూ.901కి పెరిగింది. ఆయా కంపెనీలు అన్ని రకాల విత్తనాల ధరలు పెంచేశాయి. అంతకంతకూ పెరుగుతున్న పెట్టుబడులతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
పత్తి విత్తన ప్యాకెట్ల ధరలు పెంచిన కంపెనీలు
ఇప్పటికే పెట్టుబడి ఖర్చులు తడిసి మోపెడు
మరింతగా పడనున్న ఆర్థిక భారం
ఆందోళనలో అన్నదాతలు
ధరలు తగ్గించాలి
పత్తి విత్తనాల ధరలను ఏటా పెంచుతుండంతో ఆర్థిక భారం పడుతోంది. పెంచిన ధరలను కంపెనీలు వెంటనే తగ్గించాలి. లేదంటే ప్రభుత్వం రాయితీ ఇవ్వాలి. విత్తనాల కొనుగోలు నుంచి చేతికొచ్చిన పంట అమ్మే దాకా రైతుల చేతిలో ఏదీ ఉండడం లేదు.
– నర్సింహారెడ్డి, రైతు, మన్‌మర్రి
ఖర్చులు పెరిగాయి
ప్రతీ సంవత్సరం పత్తి పంట సాగు చేసేందుకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. ఎకరాకు సుమారు రూ.40 వేల నుంచి రూ.50 వేల దాకా ఖర్చు వస్తోంది. విత్తనాల ప్యాకెట్ల ధరల పెంపుతో మరింత భారం పడుతోంది. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి.
– విజయభాస్కర్‌రెడ్డి, రైతు, మరియాపురం

రైతు నెత్తిన.. విత్తన భారం

రైతు నెత్తిన.. విత్తన భారం

రైతు నెత్తిన.. విత్తన భారం