చంద్రబాబు భజన చేస్తూ... వార్తలను, వాస్తవాలను వక్రీకరిస్తూ పబ్బం గడుపుకొంటున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మరోసారి తనవంకర బుద్ధిని బయటపెట్టుకుంది. టీడీపీ సేవలో తరిస్తూ సాక్షి మీడియాపై పడి ఏడ్చే ఆ పత్రిక, టీవీ యాజమాన్యం డిజిటల్ మీడియాపై కనీస అవగాహన లేకుండా ‘సాక్షి’కి వ్యతిరేకంగా వార్తలను వండి వార్చుతోంది.
వ్యూస్‌ను, ట్రాఫిక్‌ను పెంచుకొనేందుకు ‘సాక్షి’ కుట్ర పన్నిందనీ... సాక్షి వెబ్‌సైట్ వార్తల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్‌లైన్ వాడుతున్నారనీ ఎల్లో పత్రికలో తప్పుడు వార్తను ప్రచురించడమే కాకుండా... రెండు రోజులపాటు ఏబీఎన్ చానల్‌లో అర్థంపర్థం లేని చర్చలను నడిపించింది. డిజిటల్ జర్నలి జంలో ట్యాగ్ లైన్స్ ఎందుకు వాడతారు? ఏ సందర్భంలో ఎలాంటి ట్యాగ్ లైన్స్ వాడతారు? అసలు గూగుల్ ఎనలటిక్స్, వెబ్‌సైట్ మెట్రిక్స్ ఎలా పనిచేస్తాయన్న పరిజ్ఞానం లేకుండా ‘సాక్షి’పై విషం చిమ్మే ప్రయత్నం మొదలుపెట్టింది.
ఎవరైనా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో వార్తలను సెర్చ్ చేయాలనుకుంటే వాళ్లకు సాక్షి వార్తలు కనిపించేలా సాక్షి డాట్ కామ్‌లో ఏర్పాటు చేసుకున్నారంటూ బుర్ర తక్కువ వాదనను తెరపైకి తెచ్చింది ఎల్లో మీడియా. ఇలా చేయడం ద్వారా ఏబీఎన్ ట్రాఫిక్ మొత్తం ‘సాక్షి’కి వచ్చేస్తుందట. ఇంతకంటే అవగాహనా రాహిత్యం ఇంకేమైనా ఉంటుందా? వినేవాళ్లు ఉంటే పచ్చ పత్రికలు, చానళ్లు ఏదైనా చెబుతాయనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. వాస్తవానికి సాక్షి డాట్ కామ్ వెబ్ ట్రాఫిక్ ఎప్పుడూ ఆంధ్రజ్యోతికి అందనంత ఎత్తులో ఉంటుంది.
ప్రజల ముందు వార్తలతోపాటు వాస్తవాలను మాత్రమే అందించే సాక్షి డాట్ కామ్‌కు ఉన్న ఆదరణ ఆంధ్రజ్యోతికి ఎప్పుడూ లేదు. వెబ్‌సైట్ ఎనలటిక్స్‌ను బేరీజు వేసుకుంటే ఆ అంకెలే చెబుతాయి సాక్షి స్థాయి ఏమిటో. అలాంటిది పచ్చ పత్రిక నుంచి వెబ్ ట్రాఫిక్‌ను డైవర్ట్ చేసుకొనేందుకు కుట్రలు చేయాల్సిన ఖర్మ సాక్షి మీడియాకు లేనేలేదు. అసలు టెక్నికల్‌గా, లాజికల్‌గా చూసుకున్నా అలా జరిగే అవకాశాలు ఏమాత్రం లేవు.
సాధారణంగా ఏదైనా న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ చేయాల్సి వస్తే ఆ వార్తకు సంబంధించిన వ్యక్తులు, వ్యవస్థల పేర్లను ట్యాగ్ లైన్స్‌గా జత చేస్తారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేసే రాజకీయ విష ప్రచారానికి కౌంటర్‌గా సాక్షి డాట్ కామ్‌లో ఏదైనా వార్తను ప్రచురిస్తే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్‌ను కచ్చితంగా ఉపయోగిస్తారు.
ఇలా చేయడం అనైతికం, కుట్ర అని ఏబీఎన్ ఆంధ్ర జ్యోతికి అనిపిస్తే... డిజిటల్ మీడియా గురించి వాళ్లకు ఓనమాలు కూడా తెలియవనే అనుకోవాలి. ఒక పత్రిక లేదా సంస్థ ఇతర పత్రికలు, సంస్థలకు చెందిన పేర్లు, ట్యాగ్‌లను సహజంగా ఉప యోగించదు అన్నది నిజమేగానీ... ఆ పత్రికా సంస్థకు సంబంధించిన వార్తను ప్రజలకు చేర్చాలనుకున్నప్పుడు ఆ పేర్లు లేకుండా... వాటిని ట్యాగ్ లైన్స్‌లో పెట్టకుండా ఎలా పబ్లిష్ చేస్తారో ఏబీఎన్ మేధావులకే తెలియాలి.
ఏ మీడియా సంస్థలు ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తు న్నాయో పాఠకులకు, వీక్షకులకు తెలియనిది కాదు. ఎల్లో మీడియా చేస్తున్న రాజకీయ కుట్రలను ఎప్పటికప్పుడు సాక్షి మీడియా ప్రజల ముందుంచుతోంది. అందులో భాగంగా ఏబీఎన్ మాత్రమే కాదు... ఏ ఇతర మీడియా సంస్థ అవాస్తవాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేసినా వాటిని ఖండిస్తూ పాఠకులకు, వీక్షకులకు నిజం చెప్పడంలో ‘సాక్షి’ ముందుంటుంది.
ప్రజల్లో విశ్వసనీయత ఉంది కాబట్టే ఆంధ్ర జ్యోతి కంటే సాక్షి డాట్ కామ్ డిజిటల్ రేటింగ్స్‌లో ముందుంది. కేవలం సాక్షి మీడియాపై బురద జల్లడమే పనిగా పెట్టుకొని ఆంధ్ర జ్యోతి చేసే తప్పుడు ప్రచారాలను ఎవరూ విశ్వసించరు.
– వర్ధెల్లి మురళి
ఎడిటర్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment