న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడం బీజేపీకి కలిసొచ్చే అంశం. పంజాబ్ మినహా మిగతా రాష్ట్రాల్లోనూ తమ పార్టీకి సానుకూల ఫలితాలు రావడంతో కమలనాథులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.
యూపీ ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికలకు చుక్కానిగా నిలుస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ రెట్టించిన ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాజా ఫలితాలు ఉత్ప్రేరకంగా పనిచేస్తాయని అంటున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలోనూ బీజేపీ సత్తా చాటేందుకు ఈ ఫలితాలు దోహదపడతాయని భావిస్తున్నారు. అంతేకాదు నరేంద్ర మోదీ నాయకత్వానికి మరింత దన్నుగా ఈ ఫలితాలు నిలుస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీకి వరుసగా రెండోసారి విజయాన్ని కట్టబెట్టిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగత ఇమేజ్ కూడా మరింత పెరిగింది.
బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయాలని భావిస్తున్న పార్టీలు తాజా ఫలితాలను జీర్ణించుకోవడం కష్టమే. కేంద్రంలో మోదీ సర్కారును గద్దె దించాలంటే బీజేపీ వ్యతిరేక పార్టీలకు ఇప్పుడున్న బలం సరిపోదని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేశాయి. తాజా ఫలితాల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, డీఎంకే, టీఆర్‌ఎస్, వామపక్ష పార్టీల భవిష్యత్ కార్యాచరణపై ఆసక్తి నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగుతాయో చూడాలి.
బీజేపీకి దీటుగా ఆప్
అయితే బీజేపీకి దీటుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుతుండటం ఆసక్తికర పరిణామం. పంజాబ్‌లో కాంగ్రెస్‌ను ఊడ్చేసిన ఆప్.. సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం పన్నుతుందో చూడాలి. భవిష్యత్తులో బీజేపీకి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన ప్రత్యర్థి అవుతారని, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా తమ పార్టీ ఎదుగుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ కో-ఇంచార్జి రాఘవ్ చద్దా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఘోర పరాజయం నుంచి కాంగ్రెస్ పార్టీ కోలుకుని సార్వత్రిక ఎన్నికలకు ఎలా సిద్ధమవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. (క్లిక్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ‘సామాన్యుడి’ పార్టీ!)
Comments
Please login to add a commentAdd a comment