ఎన్న రాస్కెల్.. మైండ్ ఇంట్.. సూపర్‌స్టార్ క్రేజ్ ఒక్క తమిళనాడు.. పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రాలు.. సౌత్.. యావత్ దేశం మాత్రమే కాదు.. ప్రపంచంలోని కొన్ని దేశాలకు కూడా విస్తరించింది. ఏడు పదుల వయసులోనూ స్క్రీన్‌పై ఆయన స్టైలింగ్ ప్రేక్షకులనూ ఆకట్టుకుంటూనే ఉంటోంది. ప్రతీ పుట్టినరోజుకి వయస్సు తగ్గిపోతుందేమో అనిపించేది.. తలైవా విషయంలోనే ఏమో!. రజనీకాంత్ స్టైల్‌కు ఉన్న ప్రత్యేకత అదే!. రజనీ పుట్టినరోజుకు.. కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. కానీ, రజనీకాంత్‌ది ప్రేమ వివాహమని.. అది చాలా గమ్మత్తుగా జరిగిందనేది మీకు తెలుసా?..
సినిమాల్లో రజనీ.. హీరోయిన్లతో ప్రేమ-పెళ్లి.. ఎంత విజీగా అయిపొగొట్టేస్తారో!. కానీ, రియల్ లైఫ్‌లో ఇష్టపడ్డ అమ్మాయిని సొంతం చేసుకోవడానికి ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు..
డెబ్భైవ దశకంలో బాలీవుడ్‌లో వచ్చిన గోల్ మాల్ చిత్రాన్ని.. తిల్లు మల్లు పేరుతో కోలీవుడ్‌లో రీమేక్ చేశారు దర్శక దిగ్గజం బాలచందర్. అందులో ఆయన ప్రియశిష్యుల్లో ఒకరైన రజనీ హీరో. కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి.. సూపర్ హిట్ అయ్యిందా చిత్రం. అయితే.. ఈ చిత్ర షూటింగ్ మధ్యలో ఓ కాలేజీ మ్యాగ్జైన్ ఇంటర్వ్యూ కోసం ఒకావిడ వచ్చారని.. రజనీతో ఆయన అసిస్టెంట్ చెప్పారు. అయితే షూటింగ్ హడావిడిలో ఉన్న రజనీ కాసేపటి దాకా ఆ విషయం పట్టించుకోలేదు. ఆపై ఆ విషయం గుర్తొచ్చి.. పక్కకి వెళ్లారు. ఆమె పేరు లతా రంగాచారి. ఆమెను చూడగానే రజనీ గుండెలో జుజుబి మొదలైంది.
మాటల మధ్యలో ఆమెది బెంగళూర్ అని చెప్పటం.. రజనీ కూడా అక్కడ కండక్టర్‌గా పని చేసిన అనుభవం ఉండటంతో ఆ మాటలు మరింత ముందుకు వెళ్లాయి. ఈ క్రమంలో ఇద్దరి ఆసక్తులు ఒక్కటేనని తేలింది. దీంతో అప్పటికే ఓ స్టార్ అయిన రజనీతో లత చనువుగా మాట్లాడేందుకు వీలైంది. ఆమెతో ఇంటర్వ్యూ కొనసాగుతున్న సమయంలోనే రజనీ మనసు.. మైండ్ రెండూ పని చేయకుండా పోయాయంట. ఆమెతో జీవితం పంచుకోవాలని డిసైడ్ అయిపోయి చివరకు ఆ క్షణంలో మరో ఆలోచన లేకుండా ఆమెకు ప్రపోజ్ చేశాడంట.
దీంతో సూపర్ షాక్ తగిలిన ఆమె చిన్నగా నవ్వి.. తన తల్లిదండ్రులతో మాట్లాడమని రజనీకి చెప్పి వెళ్లిపోయిందట. కానీ, తలైవా చాలా చిలిపి. ఆ పని వెంటనే చేయలేదు. ఆమెతో స్నేహం కొసాగిస్తూనే అదను కోసం ఎదురు చూడసాగాడు. ఈ మధ్యలో ఈ విషయాన్ని తన స్నేహితుడు, నటుడు వైజీ మహేంద్రన్‌కు చెప్పాడంట. ఆయన.. లత సోదరి సుధ భర్త కావటం విశేషం. దీంతో తన పని తేలిక అవుతుందని రజనీ భావించారు. అదే సమయంలో.. ఆమె పేరెంట్స్ ఒప్పుకుంటారో లేదోనన్న భయంతో రజనీ కొందరు సీనియర్ నటులను కూడా రంగంలోకి దింపాడంట.
చివరకు.. మహేంద్రన్ దౌత్యంతో వాళ్ల ప్రేమ ఫలించింది. రజనీకి ఊరటనిస్తూ లతా పేరెంట్స్ వారి వివాహానికి ఓకే చెప్పారు. కానీ, ఈ విషయాన్ని రజనీకి చెప్పకుండా వాళ్లు కొంత కాలం టెన్షన్‌తో ఎదురు చూసేలా చేశారట. లతా కూడా కొన్నిరోజులు ఆయనతో మాట్లాడకుండా ఏడ్పించిందట. దీంతో రజనీ ఎవరితో మాట్లాడకుండా కొన్నిరోజులపాటు డిప్రెషన్‌లోకి వెళ్లారు. చివరికి.. లత, మహేంద్రన్‌లు రజనీ ఇంటికి అసలు విషయం చెప్పడంతో ఆయన ఆశ్చర్యంతో ఆనందానికి లోనయ్యారట. అలా.. చివరకు ఏడాది తిరగక ముందే ఫిబ్రవరి 26, 1981 తిరుపతి వెంకన్న సమక్షంలో మూడు ముళ్లు.. ఏడు అడుగులతో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇది సూపర్‌స్టార్ గమ్మత్తు లవ్ కమ్ మ్యారేజ్ కహానీ!.
Comments
Please login to add a commentAdd a comment