సాక్షి, ముంబై: దీపావళి అంటే పటాసులు, దీపాలు, స్వీట్లు, లక్ష్మీ పూజ మాత్రమే కాదు ఇన్వెస్టర్లకు మరో ప్రత్యేక పండుగ కూడా ఉంది. అదే ముహూరత్ ట్రేడింగ్. ముహూరత్ ట్రేడింగ్ రోజును ఇన్వెస్టర్లు వ్యాపారులు ఒక శుభదినంగా భావిస్తారు. అందుకే ఈ రోజు కనీసం ఒక షేర్‌లో అయినా పెట్టుబడులు పెట్టి లాభాలు గడించాలని ట్రేడర్లు ఆశపడతారు. సాధారణంగా దివాలీ రోజు గంట సేపు నిర్వహించే ముహూరత్ ట్రేడింగ్ లాభాల్లోనే ముగుస్తుంది. ఫలితంగా ఏడాదంతా షేర్ మార్కెట్‌లో లాభాలే లాభాలని ఇన్వెస్టర్లు భావిస్తారు.
ఈ ఏడాది అక్టోబర్ 24న జరిగే ముహూరత్ ట్రేడింగ్ ప్రముఖ పెట్టుబడిదారుడు, బిలియనీర్ బిజినెస్ మాగ్నెట్, దివంగత రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా లేకుండానే ముగియనుంది. ప్రతీ ఏడాది అనేక మంది ఇన్వెస్టర్లకు ఆయన ఇచ్చే సలహాలు, పెట్టుబడి సూత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. సాంప్రదాయ దుస్తులతో ప్రత్యేక ఆహార్యంతో పలు ఛానెళ్లలో ఆయన మార్కెట్ మంత్రాను వివరించేవారు. మార్కెట్‌లో తన అనుభవం, టాప్ ప్లేస్‌కు చేరుకున్న తన ప్రస్థానం గురించి చెబుతూ ప్రేరణగా నిలిచేవారు.
గత ఏడాది 101 కోట్ల రూపాయల లాభం
గత ఏడాది దీపావళి ముహూరత్ ట్రేడింగ్ సందర్భంగా 5 స్టాక్‌ల పెట్టుబడిద్వారా రాకేష్ ఝన్‌ఝున్‌వాలా 101 కోట్ల రూపాయలు ఆర్జించారు. అంతేకాదు రాకేష్ రికమెండ్ చేసిన స్టాక్‌లు భారీ లాభాలను గడించాయి. ముఖ్యంగా ఫెడరల్ బ్యాంక్ ఈ ఏడాది రెండో త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ను ఆకర్షించాయి. దీంతో షేర్ వరుస లాభాలతో ఆల్ టైం గరిష్టాన్ని తాకడం విశేషం.
దీపావళి ముహూర్తం ట్రేడింగ్ సెషన్‌లో బిలియనీర్ ఇన్వెస్టర్ లేని లోటు తీరనిదని, మిస్ యూ అంటూ విశ్లేషకులు, ట్రేడర్లు రాకేశ్ ఝన్‌ఝన్‌వాలాను గుర్తు చేసుకుంటున్నారు. ట్రేడర్లు ఆయన సూచనలు, సలహాలతోపాటు చమక్కులను కూడా మిస్ అవుతారంటూ నివాళులర్పిస్తున్నారు. కాగా ట్రేడర్‌గా చార్టెడ్ అకౌంటెంట్‌గా పేరుగాంచిన రాకేశ్ ఝున్‌ఝున్ వాలా ఈ ఏడాది ఆగస్టు 14న అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment