ఎన్నికలు దగ్గరపడేకొద్దీ రాజకీయాల్లో అలజడి పెరుగుతోంది. పోటీ చేయాలనుకునేవారిలో టెన్షన్ మొదలవుతోంది. ఏ పార్టీ దీనికి అతీతం కాదు. నిజామాబాద్ కమలం పార్టీలో కూడా ప్రస్తుతం ఇదే పరిస్థితి ఏర్పడింది. అక్కడి సిటింగ్ ఎంపీకి, మాజీ ఎమ్మెల్యేకు మధ్య వైరం నానాటికి పెరుగుతోంది.
ఎంపీ అరవింద్ వర్సెస్ యెండల..
నిజామాబాద్ జిల్లా కాషాయ సేనలో గ్రూపులు రాజ్యమేలుతున్నాయి. సిటింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పార్టీలో యెండల రాష్ట్ర నాయకుడైనా.. స్థానికంగా ఎంపీ అరవింద్ హవా ముందు ఆయన ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. దీంతో ఇరు వర్గాల మధ్య చాన్నాళ్ళుగా అంతర్యుద్ధం కొనసాగుతోంది.
యెండల ప్రధాన అనుచరుడిగా ఉన్న ప్రసాద్ పటేల్‌పై వచ్చిన ఆరోపణలతో అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పటేల్‌పై వేటు వేయడానికి అరవింద్ కారణమని యెండల వర్గీయుల ఆరోపణ. ప్రసాద్ పటేల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా.. అతను తన హిందూత్వను వదల్లేదు. గోరక్షణ కోసం, లవ్ జీహాద్‌కు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పాపులర్ అవుతున్నారు. సున్నితమైన అంశాల్లో వీధికెక్కి పోరాడటం, సోషల్ మీడియాలో పోస్టులతో ఆయన మీద పోలీసులు కేసులు నమోదు చేశారు.
బల ప్రదర్శనలకు సై..
తన అనుచరుడైన ప్రసాద్ పటేల్ అంశాన్ని మాజీ ఎమ్మెల్యే యెండల అనేకసార్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించలేదు. కొద్ది రోజుల క్రితం బీజేపి నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే ఈ ర్యాలీ బయటకు చూస్తే ప్రసాద్ పటేల్‌పై పెట్టిన కేసులను ఎత్తేయాలని పోలీసులను డిమాండ్ చేయడంతో పాటు.. యెండల బలప్రదర్శన అనే వాదన ఇప్పుడు నిజామాబాద్‌లో ఊపందుకుంది.
వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా లేదా నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న యెండల స్థానికంగా తన ఉనికే ప్రశ్నార్థకంగా మారిన వేళ.. ప్రసాద్ పటేల్ అంశాన్ని ఎజెండాగా తీసుకుని పోలీసుల పేరుతో అధికార పార్టీకి వ్యతిరేకంగా భారీ ర్యాలీ తీసినప్పటికీ అందులో అంతర్లీనంగా తన స్టామినా చాటుకోవాలనే ఆకాంక్ష ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది.
ఎవరికి ఎవరు చెక్?
తనకు చెక్ పెట్టాలనుకుంటున్న ఎంపీ అరవింద్‌కు తానేంటో చూపించడానికే యెండల ఈ ర్యాలీని ఉపయోగించుకున్నారని నిజామాబాద్‌లో టాక్. ఆర్మూర్ నుంచి అరవింద్ అసెంబ్లీ బరిలోకి దిగుతాడంటూ ప్రచారం జరుగుతున్న వేళ.. గతంలో అక్కడ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఈసారి అరవింద్ వల్ల తనకు టిక్కెట్ రాదేమో అన్న అనుమానంతో ఉన్న వినయ్ రెడ్డి వంటి నేతలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఒకే పార్టీలో ఉంటూ, ఒకే ప్రాంతానికి చెందిన నాయకుల మధ్య వైరం పార్టీకి మంచిది కాదని కమలం నేతలు సలహా ఇస్తున్నారట. అయితే రాజకీయ ఉనికి చాటుకునే సందర్భంలో ఇటువంటి పోరాటాలు, వైరాలు తప్పవంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment