Special Story On Smartphone ESims - Sakshi
Sakshi News home page

పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ల వినియోగం.. ‘ఈ–సిమ్‌’ స్పెషల్‌ తెలుసుకోండి!

Published Tue, Jan 31 2023 7:42 AM | Last Updated on Tue, Jan 31 2023 8:39 AM

Special Story On Smart Phone ESims - Sakshi

సాక్షి, అమరావతి: సెల్‌ఫోన్లలో ఉపయోగించే సిమ్‌­(సబ్‌స్రై్కబర్‌ ఐడెంటిటీ మాడ్యూల్‌) కార్డు మాయమైపోతోంది. పెద్ద సైజు నుంచి క్రమంగా నానో సైజుకు వచ్చేసిన సిమ్‌ కార్డు.. ఇప్పుడు కంటికి కనిపించకుండా డిజిటల్‌ రూపంలోకి మారిపోయింది. అందుబాటులోకి వస్తోన్న అత్యాధునిక సెల్‌ఫోన్లు, వాచ్‌లతో పాటే ‘ఈ–సిమ్‌’లూ విస్తృతంగా వినియో­గంలోకి వచ్చేస్తున్నాయి. కొన్నేళ్ల కిందటే ఇది మార్కెట్‌లోకి వచ్చినా.. అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ ప్రస్తుతం సైబర్‌ మోసాలు భారీగా పెరుగుతుండటంతో అత్యధిక మంది ‘ఈ–సిమ్‌’పై ఆసక్తి చూపిస్తున్నారు. పైగా మొబైల్‌ స్టోర్‌కు వెళ్ల­కుండానే ఎస్‌ఎంఎస్, ఈ–మెయిల్‌ ద్వారా యాక్టివేట్‌ చేసుకునే అవకాశం ఉండడం ఇందులో ప్రత్యే­కత.  

సిమ్‌ కార్డులతో పెరిగిన మోసాలు  
కొన్నేళ్లుగా ఆన్‌లైన్‌ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. టెలికాం సంస్థలు, బ్యాంకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలు పుట్టుకొస్తున్నాయి. వాటిలో చాలా కేసులు సిమ్‌ స్వాప్‌ మోసాలకు సంబంధించినవే. ఇందులో నేరగాళ్లు మొదట ఫోన్‌ నంబర్లు, ఈ–మెయిల్‌ ఐడీల వంటివి సేకరిస్తారు. వివిధ ఆకర్షణీయ ఈ–మెయిల్స్, మెసేజ్‌లు పంపించి, ఫోన్‌ కాల్స్‌ చేసి అవతలి వ్యక్తుల వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత.. ఫోన్‌ పోగొట్టుకున్నామని, లేదా పాత సిమ్‌ పాడైపోయిందని చెప్పి నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌ నుంచి డూప్లికేట్‌ సిమ్‌ తీసుకుంటారు. టెలికాం ఆపరేటర్‌ కంపెనీకి సమర్పించిన వివరాలు సరైనవే అయితే.. మోసగాడు సులువుగా బాధితుడి నంబర్‌తో కొత్త సిమ్‌ తీసుకుంటాడు. సిమ్‌ యాక్టివేట్‌ అయిన తర్వాత పూర్తి కంట్రోల్‌ హ్యాకర్‌ చేతికి వెళ్లిపోతుంది. ఇక సులువుగా మన బ్యాంక్‌ అకౌంట్‌లోని డబ్బుతో పాటు ఫోన్‌లోని రహస్య సమాచారమంతా లాగేస్తాడు.

ఈ–సిమ్‌తో అడ్డుకట్ట..
ఈ–సిమ్‌ అనేది ప్రస్తుతం మనం ఫోన్లలో వినియోగిస్తున్న ఫిజికల్‌ సిమ్‌కు డిజిటల్‌ రూపం. దీన్ని యాక్టివేట్‌ చేయాలంటే వ్యక్తిగత వివరాలతో పాటు పర్సనల్‌ ఐడెంటిఫియబుల్‌ ఇన్ఫర్మేషన్‌తో రిజిస్టర్‌ చేసుకోవాలి. ఈ–సిమ్‌ అకౌంట్‌ను సెక్యూర్‌గా ఉంచుకోవడానికి ఫేస్‌ ఐడీ లేదా బయోమెట్రిక్‌ విధానంలో పాస్‌వర్డ్‌ పెట్టుకోవచ్చు. ఒకరు ఈ–సిమ్‌ వాడుతున్నప్పుడు మరొకరు సిమ్‌ పోయిందని లేదా పాడైపోయిందని నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌కు ఫిర్యాదు చేయడానికి కుదరదు. అదే నంబర్‌తో మరో సిమ్‌ను తీసుకునే అవకాశం కూడా ఉండదు. ఎవరైనా అలా చేస్తే.. వారు సైబర్‌ నేరగాళ్లుగా గుర్తించి పట్టుకునేందుకు వీలుంటుంది. ప్రస్తుతం అమెరికాలో వినియోగిస్తున్న ఐఫోన్‌–14 మోడ­ల్స్‌కు సిమ్‌ స్లాట్స్‌ లేవు. ఇవి ఈ–సిమ్‌ను మాత్రమే సపోర్ట్‌ చేస్తాయి.

సులభంగా యాక్టివేషన్‌.. డీ–యాక్టివేషన్‌  
వీటిని సులభంగా యాక్టివేట్‌ చేయడంతో పాటు డి–యాక్టివేట్‌ కూడా చేయవచ్చు. మలి్టపుల్‌ ఫోన్‌ నంబర్లు, ప్లాన్లను ఒకే డివైజ్‌లో వినియోగించుకోవచ్చు. అంటే సింగిల్‌ సిమ్‌ మాత్రమే సపోర్టు చేసే లేటెస్ట్‌ ఫోన్లలో అదనంగా ఈ–సిమ్‌ కూడా వినియోగించుకోవచ్చన్నమాట. వీటిని పోగొట్టుకోవడం, పాడవడం లేదా దొంగిలించడం వంటివి సాధ్యం కాదు. వివిధ నెట్‌వర్క్‌లకు, ప్లాన్లకు సులువుగా మారవచ్చు. పైగా నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌ స్టోర్‌కు వెళ్లే అవసరం కూడా ఉండదు. అన్నీ రిమోట్‌ విధానంలోనే ఎస్‌ఎమ్‌ఎస్, ఈ–మెయిల్‌ ద్వారానే యాక్టివేట్‌ చేయవచ్చు. అయితే, మనం వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌ ఈ–సిమ్‌ను సపోర్ట్‌ చేస్తుందా.. టెలికాం ఆపరేటర్‌ ఈ తరహా సదుపాయాలు అందిస్తున్నారా లేదా అని తెలుసుకోవాలి. మనదేశంలో ఐఫోన్, శామ్‌సంగ్, హానర్, గూగుల్‌ ఫ్లిక్స్, సోనీ, షావోమీ, నోకియా, మొటొరోలా తదితర కంపెనీలకు చెందిన కొన్ని స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే ఈ–సిమ్‌ను సపోర్టు చేస్తున్నాయి.

మొదటిసారిగా శామ్‌సంగ్‌లో..
ప్రపంచంలో మొట్టమొదట ఈ–సిమ్‌ను 2016లో శామ్‌సంగ్‌ గేర్‌ ఎస్‌2 3జీ స్మార్ట్‌వాచ్‌ కోసం అందుబాటులోకి తెచ్చారు. అనంతరం 2017లో యాపిల్‌ స్మార్ట్‌ వాచ్‌లో కూడా దీన్ని ప్రవేశపెట్టారు. అతి తక్కువ కాలంలోనే పలు స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థలు తమ ఫోన్లలో ఈ–సిమ్‌ సపోర్టును ఏర్పాటు చేయగా.. పలు టెలికాం సంస్థలు ఈ–సిమ్‌ సేవలను అందుబాటులోకి తెచ్చాయి. మన దేశంలో భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్‌ జియో, వోడాఫోన్‌–ఐడియా ఈ–సిమ్‌ సేవలను అందిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement