
రాజీనామా చేసిన ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు అలా వెలుడ్డాయో, లేదో ఇలా రాజీనామాల పర్వం మొదలైంది. ఓడిపోయిన పార్టీలకు చెందిన నాయకులు నైతిక బాధ్యతగా పదవులు వదులుకోవాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కొంత మంది ఎంపీలు.. పార్లమెంట్ సభ్యత్వాలను త్యజించారు.
ప్రమాణ స్వీకారానికి ముందు రోజు..
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంతో భగవంత్ మాన్ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు రోజు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఎంపీ పదవికి రాజీనామా సమర్పించారు. సంగ్రూర్ జిల్లాలోని ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన గెలిచారు. కాగా, కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమితో పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన పదవిని కోల్పోయారు.
మండలికి యోగి రాజీనామా
యూపీ ముఖ్యమంత్రిగా వరుసగా రెండో పర్యాయం ఎన్నికైన యోగి ఆదిత్యనాథ్.. శాసనమండలి సభ్యత్వాన్ని వదులుకున్నారు. తాజా ఎన్నికల్లో గోరక్‌పూర్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి భారీ మెజారిటీతో ఆయన విజయం సాధించారు. దీంతో మార్చి 21న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. జూలై 6న ఎమ్మెల్సీ పదవి గడువు ముగియనుంది.
ఎంపీ పదవిని వదులుకున్న అఖిలేశ్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా ఎంపీ పదవిని త్యాగం చేశారు. ఆజంగఢ్ లోక్‌సభ ఎంపీగా ఉన్న ఆయన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కర్హాల్ నుంచి గెలిచారు. యూపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో ఆయన ఎంపీ పదవిని వదులుకున్నారు.
అఖిలేశ్ బాటలో ఆజంఖాన్
సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్ కూడా అఖిలేశ్ బాటలో నడిచారు. రాంపూర్ లోక్‌సభ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ముగిసిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాంపూర్ నుంచి ఆయన విజయం సాధించారు. (క్లిక్: కంచు కోటలు బద్దలు కొట్టారు.. చరిత్ర సృష్టించారు!)
పీసీసీ ప్రెసిడెంట్‌లకు షాక్
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నిరుత్సాహపూరిత ఫలితాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ఆయ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల పదవులను పీకిపారేసింది. పదవుల నుంచి దిగిపోవాలని సోనియా గాంధీ అల్టిమేటం జారీ చేయడంతో ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు రాజీనామా చేశారు. అజయ్ కుమార్ లల్లూ(యూపీ), గణేశ్ గోడియాల్(ఉత్తరాఖండ్), నవజ్యోత్ సింగ్ సిద్ధూ(పంజాబ్), గిరీష్ చోడంకర్(గోవా), నమీరక్పామ్ లోకేన్ సింగ్(మణిపూర్) పదవులు కోల్పోయారు. (క్లిక్: మమతా బెనర్జీ అనూహ్య నిర్ణయం..)
ఎమ్మెల్యే పదవికి చద్ధా రాజీనామా
ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ ఇంచార్జిగా వ్యవహరించిన ఢిల్లీ యువ ఎమ్మెల్యే రాఘవ్ చద్ధా తన శాసనసభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. రాజ్యసభకు నామినేట్ కావడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment