
నిర్మాణ ంలో ఉన్న సీసీ రోడ్డు
నిధులున్నా.. ముందుకుసాగని పనులు..
కాంట్రాకర్లకు కలిసొచ్చేపనులే ఎంపిక..
సీఎం కేసీఆర్ ప్రత్యేకంగామంజూరు చేసిన నిధుల తీరిది
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మంజూరు చేసిన స్పెషల్ డవలప్‌మెంట్ ఫండ్స్ (ఎస్‌డీఎఫ్) వినియోగం అస్తవ్యస్తంగా సాగుతోందనే ఆరోపణలున్నాయి. ఈ నిధులతో చేపట్టిన పనులు ఆశించిన మేరకు ముందుకు సాగడం లేదు. పరిపాలన అనుమతులు మంజూరు చేసి ఆరు నెలలు దాటింది. అయినా ఇంకా చాలా చోట్ల పనులు అసలు ప్రారంభానికే నోచుకోలేదు.
రూ.371.40 కోట్లతో పనులు ఎస్‌డీఎఫ్ కింద ప్రభుత్వం ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.20 లక్షల చొప్పున, మున్సిపాలిటీలకు రూ.20 కోట్లు మంజూరు చేసింది. సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీలకు రూ.50 కోట్ల చొప్పున మంజూరయ్యాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం రూ.371.40 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు గత ఏడాది జూలైలో ఈ పనులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆయా వార్డుల్లో తిరిగి క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పనులను ఎంపిక చేయాల్సి ఉండగా, ఆయా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మొక్కుబడిగా తిరిగి పనులను ఎంపిక చేశారు.
ఆ మూడు పనులకే ప్రాధాన్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబందించిన పనులను ఎంపిక చేయాల్సి ఉండగా, చాలా చోట్ల కాంట్రాక్టర్లకు కలిసొచ్చే పనులు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం వంటి వాటికే ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువమంది బీఆర్‌ఎస్‌కు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే ఈ పనులను పంచుకున్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ఈ పనుల కోసం ఏకంగా వాగ్వావాదాలకు దిగిన ఘటనలు కూడా ఉన్నాయి.
ఇదీ పనుల ప్రగతి..
అన్ని గ్రామ పంచాయతీల్లో రూ.121.40 కోట్ల అంచనా వ్యయంతో 2,478 పనులు చేపట్టారు. ఇప్పటి వరకు కేవలం 189 పనులకు సంబంధించి రూ.8.88 కోట్ల మేరకు మాత్రమే పనులు జరిగాయి.
అన్ని మున్సిపాలిటీల్లో కలిపి రూ.250 కోట్లతో 939 పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో ఇప్పటి వరకు కేవలం రెండే పనులకు రూ.94 లక్షలు మాత్రమే వినియోగించుకోగలిగారు.
పనులు జరుగుతున్నాయి..: జగదీశ్వర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పీఆర్
ఎస్‌డీఎఫ్‌లో చేపట్టిన పనులు కొనసాగుతున్నాయి. ఆయా స్థానిక సంస్థల తీర్మానాల మేరకు నామినేషన్‌పై పనులు అప్పగించాం. పలు గ్రామాల్లో పనులు చేసేది ఒకరిద్దరే కావడంతో ఆయా చోట్ల కొన్ని పనులు ప్రారంభించాల్సి ఉంది.
‘‘ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు, మున్సిపాలిటీలకు రూ.20 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నా.. ఈ భారీ మొత్తంలో మంజూరు చేస్తున్న ఈ ప్రత్యేక నిధులను సద్వినియోగం చేసుకోండి. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి క్షేత్రస్థాయిలో తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ఖర్చు చేయండి.’’
– గత ఏడాది నారాయణఖేడ్‌లో జరిగిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ చెప్పిన మాటలివి.
