ఆంజనేయులు మృతదేహం వద్దరోదిస్తున్న కుటుంబ సభ్యులు
మెదక్: ఒకే కడుపున పుట్టిన తమ్ముడిని అన్న దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణం చిన్నశంకరంపేట మండలంలోని శాలిపేట గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శాలిపేట గ్రామానికి చెందిన ముండ్రాతి ఆంజనేయులు (35), సత్యనారాయణ, సిద్దిరాములు ముగ్గురూ అన్నాదమ్ముళ్లు. వీరు ఇప్పటికే తల్లిదండ్రుల ఆస్తి పంచుకున్నారు. ఇందులో సత్యనారాయణకు చెరువు సమీపంలో ఐదెకరాలు రాగా, ఆంజనేయులుకు పోచమ్మ మర్రిచెట్టు సమీపంలో ఐదెకరాలు వచ్చింది.
సత్యనారాయణ పొలం వద్ద నీళ్లు సరిగా లేవని, మళ్లీ భూమి పంచుకుందామని ఆంజనేయులుతో అన్నాడు. ఇద్దరం మర్రిచెట్టు దగ్గర ఒక్కొక్కరికి రెండున్నర, చెరువు దగ్గర రెండున్నర చొప్పున తీసుకుందామని గ్రామ పెద్దల సమక్షంలో నిర్ణయించుకున్నారు. సత్యనారాయణ చెప్పినట్లు భూమిని పంచారు. చెరువు దగ్గర ఉన్న బోరును కూడా ఇద్దరూ సమానంగా వాడుకోవాలని గ్రామపెద్దలు చెప్పారు. ఈ క్రమంలో బోరు మాత్రం నేను ఒక్కడినే వాడుకుంటా అని సత్యనారాయణ అన్నాడు.
దీనికి అంజనేయులు ఒప్పుకోకపోవడంతో వివాదం మొదలైంది. రోజులాగే బుధవారం ఉదయం నారుమడికి నీరు పెట్టేందుకు ఆంజనేయులు వెళ్లాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సత్యనారాయణ మరో వ్యక్తితో కలిసి ఆంజనేయులుపై దాడి చేసి తలపై కొట్టాడు. తీవ్ర గాయాలతో ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
న్యాయం చేయాలని ఆందోళన!
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, అప్పటి వరకు మృతదేహాన్ని తరలించేది లేదని బంధువులు అడ్డుకున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రామాయంపేట సీఐ లక్ష్మీబాబు, చిన్నశంకరంపేట, చేగుంట, నార్సింగి, నిజాంపేట ఎస్‌ఐలు నారాయణ, హరీశ్‌గౌడ్, మొహినుద్దీన్, శ్రీనివాస్ రెడ్డి బందోబస్తు నిర్వహించారు. మృతుడికి భార్య లక్ష్మితోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇవి చదవండి: పాలమూరు యూనివర్సిటీలో దారుణం! డిబార్ చేశారని.. విద్యార్థి?
Comments
Please login to add a commentAdd a comment