brothers attack
-
మరొకరితో కలిసి తమ్ముడిని అన్న దారుణంగా..
మెదక్: ఒకే కడుపున పుట్టిన తమ్ముడిని అన్న దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణం చిన్నశంకరంపేట మండలంలోని శాలిపేట గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శాలిపేట గ్రామానికి చెందిన ముండ్రాతి ఆంజనేయులు (35), సత్యనారాయణ, సిద్దిరాములు ముగ్గురూ అన్నాదమ్ముళ్లు. వీరు ఇప్పటికే తల్లిదండ్రుల ఆస్తి పంచుకున్నారు. ఇందులో సత్యనారాయణకు చెరువు సమీపంలో ఐదెకరాలు రాగా, ఆంజనేయులుకు పోచమ్మ మర్రిచెట్టు సమీపంలో ఐదెకరాలు వచ్చింది. సత్యనారాయణ పొలం వద్ద నీళ్లు సరిగా లేవని, మళ్లీ భూమి పంచుకుందామని ఆంజనేయులుతో అన్నాడు. ఇద్దరం మర్రిచెట్టు దగ్గర ఒక్కొక్కరికి రెండున్నర, చెరువు దగ్గర రెండున్నర చొప్పున తీసుకుందామని గ్రామ పెద్దల సమక్షంలో నిర్ణయించుకున్నారు. సత్యనారాయణ చెప్పినట్లు భూమిని పంచారు. చెరువు దగ్గర ఉన్న బోరును కూడా ఇద్దరూ సమానంగా వాడుకోవాలని గ్రామపెద్దలు చెప్పారు. ఈ క్రమంలో బోరు మాత్రం నేను ఒక్కడినే వాడుకుంటా అని సత్యనారాయణ అన్నాడు. దీనికి అంజనేయులు ఒప్పుకోకపోవడంతో వివాదం మొదలైంది. రోజులాగే బుధవారం ఉదయం నారుమడికి నీరు పెట్టేందుకు ఆంజనేయులు వెళ్లాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సత్యనారాయణ మరో వ్యక్తితో కలిసి ఆంజనేయులుపై దాడి చేసి తలపై కొట్టాడు. తీవ్ర గాయాలతో ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. న్యాయం చేయాలని ఆందోళన! పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, అప్పటి వరకు మృతదేహాన్ని తరలించేది లేదని బంధువులు అడ్డుకున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రామాయంపేట సీఐ లక్ష్మీబాబు, చిన్నశంకరంపేట, చేగుంట, నార్సింగి, నిజాంపేట ఎస్ఐలు నారాయణ, హరీశ్‌గౌడ్, మొహినుద్దీన్, శ్రీనివాస్ రెడ్డి బందోబస్తు నిర్వహించారు. మృతుడికి భార్య లక్ష్మితోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇవి చదవండి: పాలమూరు యూనివర్సిటీలో దారుణం! డిబార్ చేశారని.. విద్యార్థి? -
సొంత తమ్ముళ్లే.. మూడుసార్లు 'కప్పు టీ' తో అన్నపై..
ఆదిలాబాద్: తమ చేనులో ఉన్న నిధి తవ్వకానికి అడ్డువస్తున్న తమ్ముళ్లు అన్నను అడ్డు తొలగించుకోవడానికి పథకం వేసి దొరికిపోయారు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన షేక్ బిలాల్, షేక్ సులేమాన్, షేక్ ఆదాం ముగ్గురు అన్నదమ్ములు. తమ చేనులో ఉన్న నిధి (బంగారం)ని తవ్వడానికి అన్న షేక్ ఆదాం ఒప్పుకోడని నిర్ధారించుకుని అతడిని అంతం చేయాలని షేక్ బిలాల్, షేక్ సులేమాన్ పథకం పన్నారు. గ్రామానికి చెందిన షేక్ అజ్గర్‌ను కలిసి షేక్ ఆదాంను మట్టుబెట్టడానికి గ్రామానికి చెందిన తాళ్ల రమేశ్‌తో బేరం కుదుర్చుకున్నారు. తాళ్ల రమేశ్ పథకం ప్రకారం షేక్ ఆదాంకు తన ఆవును విక్రయిస్తానని నమ్మించి ఈ నెల 5న ఇంటికి పిలిచాడు. తనే స్వయంగా చాయ్‌లో మత్తు పదార్థాలు కలిపి షేక్ ఆదాంకు ఇవ్వగా అతడు దానిని తాగలేదు. మళ్లీ 8వ తేదీన ఆదాం తన టైలర్‌షాప్‌లో పని చేస్తుండగా రమేశ్ హోటల్ నుంచి చాయ్ తీసుకువచ్చి ఆదాంకు ఇచ్చాడు. అనుమానంతో ఆదాం చాయ్ తాగలేదు. అదేరోజు సాయంత్రం ఆదాం తన చేనులో పని చేస్తుండగా రమేశ్ చాయ్ తీసుకువెళ్లాడు. దీంతో అనుమానించిన ఆదాం రమేశ్‌ను బెదిరించాడు. దీంతో రమేశ్ అసలు విషయం చెప్పాడు. దీంతో ఆదాం పోలీసులకు ఫిర్యాదు చేయగా నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
దారి కోసం నరుక్కున్న అన్నదమ్ములు
పశ్చిమగోదావరి, పెరవలి: పొలం వద్ద దారి కోసం సొంత అన్నదమ్ములు నరుక్కున్న ఘటన ఇది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పెరవలి ఎస్సై వి.జగదీశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖండవల్లి గ్రామానికి చెందిన కొవ్వూరి శేషయ్యకు నలుగురు కుమారులు. వీరిలో కొవ్వూరు ధర్మయ్య, కొవ్వూరు నాగేశ్వరరావు, కొవ్వూరు ముసలయ్యకు పంట చేను ఉంది. వీరిలో కొవ్వూరి ధర్మయ్య తన చేను నుంచి వెళ్లటానికి వీలులేదని గత కొంత కాలంగా గొడవలు పడుతున్నారు. ఈ తగువులు జరుగుతుండగానే శుక్రవారం కొవ్వూరు నాగేశ్వరరావు ఆయన కుమారుడు మార్కండేయులు, మరో తమ్ముడు కొవ్వూరి ముసలయ్యలు కలసి ఎండు గడ్డిని తీసుకువచ్చి మేటు వేద్దామని దింపారు. గడ్డిని మోస్తుండగా కొవ్వూరి ధర్మయ్య, వారి కుమారులు బార్గవ, శేఘ వచ్చి ఇలా పట్టుకెళ్లటానికి కుదరదని చెప్పటం ఘర్షణకు కారణమైంది. మాటామాటా పెరిగి తొలుత కర్రలతో దాడులు చేసుకున్నారు. ఆ తర్వాత ధర్మయ్య, ఆయన కుమారులు కత్తులతో దాడి చేయటంతో నాగేశ్వరరావు, ముసలయ్య, మార్కండేయులకు తీవ్రగాయాలయ్యాయని తెలిపారు. దీంతో క్షతగాత్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వైద్యం నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
మద్యం కోసం చెల్లిని చావబాదిన అన్నలు
అమీర్ పేట: చెల్లిని బడిలో చేర్చించి విద్య నేర్పించాల్సిన అన్నలు ఆమెను ఇళ్లల్లో పని మనిషిగా చేర్చారు... మద్యం కోసం డబ్బులు కావాలని వేధించి చావబాదారు. దీంతో మనస్తాపం చెందిన బాలిక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ఎస్సార్‌నగర్ ఠాణా పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. ఎస్ఐ నవీన్ కథనం ప్రకారం... బల్కంపేట బీకేగూడ మజీద్ బస్తీకి చెందిన యూసుఫ్‌మియా కురేషికి ఆరుగురు సంతానం. మటన్ కొట్టులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మూడో కూతురు సబా (15) ఉర్దూ మీడియంలో నాలుగో తరగతి చదువుతున్న సమయంలో ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బడి మాన్పించారు. తెలిసిన ఇళ్లలో పాచిపని చేస్తూ సబా తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటోంది. అన్నలు ముగ్గురూ జులాయిగా తిరుగుతూ మద్యానికి అలవాటు పడ్డారు. మద్యం తాగి ఇంటికి వచ్చి తరుచూ తల్లిదండ్రులతో గొడవపడేవారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు మద్యానికి డబ్బులు కావాలని కొడుకులు తండ్రితో గొడవకు దిగగా.. ఆయన తన వద్ద డబ్బులు లేవని చెప్పారు. ఎలాగైనా మాకు డబ్బు ఇవ్వాల్సిందేనని చెల్లి సబాను అన్నలు పట్టుబట్టారు. ఇచ్చేందుకు నిరాకరించిన చెల్లెలుపై చెయ్యి చేసుకున్నారు. దీంతో తీవ్రమనస్తాపం చెందిన సబా గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బాలిక ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చి సాయంత్రం 6.30కి గదిలోకి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందికి దించి ఉస్మానియాకు తరలించగా.. అప్పటికే సబా మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. ఆసుపత్రి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరిపారు. సోదరుల వేధింపుల కారణంగానే సబా ఆత్మహత్య చేసుకుందని నిర్థారించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సోదరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.