ఆర్నెల్లు పొడిగింపు
పీఏసీఎస్‌ల పదవీకాలం పెంపుపై ప్రభుత్వం ఉత్తర్వులు
పునర్వ్యవస్థీకరణ అనంతరం ఎన్నికలు
నారాయణఖేడ్: జిల్లా సహకార సంఘాల పాలకవర్గాల (పీఏసీఎస్ –ప్యాక్స్) పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఆరునెలలపాటు పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం జీవో నం 74 జారీ చేసింది. దీంతో జిల్లాలో డీసీసీబీ పరిధిలోని 37, స్టేట్ బ్యాంకు పరిధిలోని 16 పీఏసీఏస్‌లు కలిపి మొత్తం 53 ప్రాథమిక సహకార సంఘాల పాలకవర్గాల పదవీకాలం పెంచినట్లైంది. ఇటీవల పీఏసీఎస్‌లు, డీసీసీబీ పాలకవర్గాలు రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి ద్వారా పదవీకాలం పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ప్రభుత్వానికి వచ్చిన నివేదిక మేరకు మరో ఆరునెలలపాటు వీరి పదవీకాలం పెంచుతూ ఉత్తర్వులు వెలువరించింది. సహకార సంఘాలు వ్యవసాయ ఉత్పత్తులు, సరఫరా, మార్కెటింగ్ వ్యూహాలు వేగంగా జరుగుతున్న తరుణంలో పీఏసీఎస్‌ల పునర్వ్యవస్థీకరణ అవసరం అని సహకార సంఘాల డైరెక్టర్ ప్రభుత్వానికి నివేదించారు. సేవా ప్రాంతం, వ్యాపార టర్నోవర్, వ్యాపార సామర్థ్యం, ఆర్థిక సాధ్యత, సేవల డెలివరి తదితర అంశాలపై రాష్ట్రంలోని పీఏసీఎస్‌ల పునర్వ్యవస్థీకరణ కోసం ప్రతిపాదనలు పంపించాలని డీసీసీబీలు, డీసీవోలు, సీఈవోలకు సహకార సంఘాల రిజిస్ట్రార్ నివేదించారు. పీఏసీఎస్‌ల పునర్నిర్మాణంకు సమగ్ర పథకాన్ని తయారు చేశాక పీఏసీఎస్‌లు, డీసీసీబీలు టీజీసీఏబీలకు ఎన్నికలు నిర్వహించాలని సహకార సంఘాల రిజిస్ట్రార్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. పై అంశాలను పరిశీలించిన పాలకవర్గాల పదవీకాలాన్ని ఆరునెలలపాటు పొడిగించింది.
పీఏసీఎస్‌ల పునర్వ్యవస్థీకరణ
పీఏసీఎస్‌లను పెంచి వాటిని బలోపేతం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఒక్కో పీఏసీఎస్‌ల పరిధిలో గ్రామాల సంఖ్య అధికంగా ఉండటం, రెండు మండలాలు కలిపి ఒక పీఏసీఎస్‌లు ఉండటం, మండలాలు, జిల్లాలు పునర్వ్యవస్థీకరణ అయిన దృష్ట్యా పీఏసీఎస్‌లను ప్రభుత్వం విస్తరించనుంది. జిల్లాలో మరో 8 నూతన పీఏసీఎస్‌లు నాగల్‌గిద్ద, తడ్కల్, నిజాంపేట్, హత్నూర, జహీరాబాద్, వడ్డేపల్లి, మునిపల్లి, ఆత్మకూర్, వట్‌పల్లిల్లో ఏర్పాటుకు ప్రతిపాదించారు. 2020 ఫిబ్రవరి రెండో వారంలో సహకార సంఘాల ఎన్నికల ను నిర్వహించారు. సాధారణంగా పాలక వర్గాల పదవీకాలం ఆరునెలల సమయం ఉండగానే ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. కానీ, పీఏసీఎస్‌లను బలోపేతం చేయడం, అవసరం మేర కొత్తవి ఏర్పాటు చేసి ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. ఈ దృష్ట్యా వీరి పదవీకాలం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment