17 ఏళ్ల కల సాకారమైన వేళ..
ఎట్టకేలకు డీఎస్సీ 2008 అభ్యర్థులకు పోస్టింగ్
● అభ్యర్థుల్లో వెల్లివెరిసిన ఆనందం
● జిల్లాలో 67 మందికి ప్రయోజనం
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): సుదీర్ఘ నిరీక్షణ.. ఎగతెగని పోరాటం.. 17 ఏళ్లకు ఉద్యోగం వరించింది. 2008లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావడంతో అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొని పరీక్ష రాశారు. కానీ తమకంటే తక్కువ అర్హత ఉన్నవారికి ఉద్యోగాలు ఇవ్వడంతో కోర్టు మెట్లు ఎక్కారు. నేడు న్యాయస్థానం ఆదేశాల మేరకు కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు పొందారు. సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలను చేపడుతుంది. డీఎస్సీ 2008 నోటిఫికేషన్ ఆధారంగా అర్హత సాధించిన వారిలో ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్) పోస్టులను 70 శాతం బీఎడ్, డీఎడ్ అభ్యర్థులతో భర్తీ చేయగా, మిగిలిన 30 శాతం డీఎడ్ అభ్యర్థులతో భర్తీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ కౌన్సెలింగ్‌కు హాజరై ఉద్యోగాలు పొందని బీఎడ్ అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. తమ కంటే తక్కువ అర్హత ఉన్న డీఎడ్ అభ్యర్థులకు 30 శాతం ఎస్జీటీ పోస్టులను రిజర్వ్ చేయడాన్ని సవాల్ చేశారు. అప్పటి నుంచి పోరాడుతుండగా నేటికి తెరపడింది. వారికి నియామక పత్రాలను అందజేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
జిల్లాలో 67 మంది
న్యాయస్థానం ఆదేశాలతో జిల్లాలో ఎస్జీటీ కేటగిరిలో డీఎస్సీ 2008 అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు ఇచ్చారు. ఇటీవల కలెక్టరేట్‌లో నిర్వహించిన కౌన్సిలింగ్‌కు హాజరైన వారందరికీ ఆయా మండలాల్లో ఖాళీగా ఉన్న ఎస్జీటీ పోస్టులను భర్తీ చేశారు. వీరికి నెలకు రూ.31,040 వేతనంతో నియమించగా ఆయా పాఠశాలల్లో విధుల్లో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment