కార్పొరేట్ల లాభాలకే పెద్దపీట
రాజకీయ విశ్లేషకుడు పాపారావు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేసి కార్మికుల సంక్షేమానికి కోతలు విధించిందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పాపారావు అన్నారు. సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కేబుల్ కిషన్ భవన్‌లో ‘కేంద్ర బడ్జెట్– కార్మిక వర్గంపై ప్రభావం‘అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కార్మిక వర్గం క్షేమంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. సంపద సృష్టించే కార్మిక వర్గానికి ఆదాయంలో వాటా దక్కడం లేదని వాపోయారు. పెట్టుబడిదారులకు రాయితీలు ఇవ్వడం ద్వారానే సంపద పెరుగుతుందనే భ్రమలో పాలకులు ఉన్నారని ఎద్దేవా చేశారు. దేశంలోని కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం కోట్ల రూపాయల రాయితీలు, రుణాల మాఫీ చేస్తూ వచ్చినప్పటికీ ఉత్పత్తి 75శాతానికి మించి జరగలేదని వివరించారు. అందుకే 14 రకాల ఉత్పత్తి సంబంధిత ఇన్సెంటివ్‌లను రద్దు చేస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించిందని గుర్తు చేశారు. మధ్యతరగతి కుటుంబాలకు రూ.12లక్షల ఆదాయపన్ను రాయితీ ఇచ్చినంత మాత్రాన వారి ఆదాయాలు పెరగవని చెప్పారు. పన్ను రాయితీ వెనుక కూడా కార్పొరేట్ శక్తుల లాభాలు దాగి ఉన్నాయని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో పేదలకు జరిగిన అన్యాయంపై సెమినార్లు, సదస్సులు నిర్వహించి ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. వివిధ సంఘాల నాయకులు మల్లేశం, సాయిలు, రామచంద్రం, జయరాజు, నరసింహులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment