తాగునీటికి ముందస్తు చర్యలు
● సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాం
● కలెక్టర్ వల్లూరు క్రాంతి
సంగారెడ్డి జోన్: వేసవి కాలంలో తాగు నీటి సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శాంతికుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ..జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామని, మరింత సమర్థంగా అమలు చేయడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామని తెలిపారు. జహీరాబాద్, నారాయణఖేడ్ వంటి ప్రాంతాలలో వేసవి ప్రారంభమయ్యే దశలోనే తాగునీటి కొరత ఎదురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. నీటి ఎద్దడి ఎదుర్కొనే గ్రామాల్లో ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అందులో భాగంగా మోటార్లు, పైప్‌లైన్లు, హ్యాండ్‌పంపుల మరమ్మతులు చేపట్టడం, గ్రామాల్లో తాగునీటి సరఫరా మెరుగుపరిచే చర్యలు తీసుకుంటామని చెప్పారు. నీటి అవసరాలను తీర్చేందుకు సింగూరు ప్రాజెక్టు జలాలను సమర్థవంతంగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్ కలెక్టర్ మాధూరి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, జిల్లా అధికారులు సాయిబాబా, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment