దుబ్బాకటౌన్: ఉరేసుకొని హమాలీ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాయపోల్ మండలం కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రఘుపతి కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన బ్యాగరి శ్రీను (45) వ్యవసాయం చేస్తూనే హమాలీ కార్మికుడిగా పని చేస్తున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిస కాగా కుటుంబ సభ్యులు మందలించి మద్యం మాన్పించారు. సోమవారం భార్య చంద్రకళతో తనకు డబ్బులు ఇవ్వాలని గొడవపడగా ఆమె ఇవ్వలేదు. మద్యం మా న్పించారని మనస్తాపం చెంది, జీవితంపై విరక్తితో మంగళవారం రాత్రి వ్యవసాయ పొలం వద్ద చెట్టుకి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య చంద్రకళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కుటుంబ కలహాలతో భర్త
చిన్నశంకరంపేట(మెదక్): ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నార్సింగి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. నార్సింగి ఎస్‌ఐ అహ్మద్ మోహినోద్దీన్ కథనం మేరకు.. నార్సింగి గ్రామానికి చెందిన వట్టెపు స్వామి(32)కి మూడేళ్ల కిందట వడియారం గ్రామానికి చెందిన శిరీషతో వివాహమైంది. పిల్లలు కావడం లేదని తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో 9 నెలల కిందట శిరీష పుట్టింటికి వెళ్లింది. పెద్దల పంచాయితీ పెట్టగా ఇరువురికి నచ్చజెప్పారు. కాపురానికి వచ్చిన భార్య 20 రోజుల కిందట మళ్లీ గొడవపడి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన స్వామి మంగళవారం ఉదయం సోదరుడు శ్రీకాంత్‌కు ఫోన్ చేసి వల్లూర్ అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు అక్కడికి చేరుకొని స్వామిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి ఆగమయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మద్యానికి బానిసై వ్యక్తి
చేగుంట(తూప్రాన్): ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చేపూరి ప్రశాంత్(31) గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్ని నెలలుగా మద్యానికి బానిసై భార్య సుకన్యను ఇబ్బందులకు గురి చేయడంతో పుట్టింటికి వెళ్లింది. దీంతో సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుకన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు.
మాజీ ఉప సర్పంచ్
కల్హేర్(నారాయణఖేడ్): ఉరేసుకొని మాజీ ఉపసర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని కృష్ణాపూర్ మాజీ ఉపసర్పంచ్ మల్దోడ్డి ఈశ్వర్(48) వ్యవసాయం చేస్తుండేవాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో మనస్తాపం చెందిన ఈశ్వర్ మంగళవారం గ్రామ శివారులోని పురాతన గడిలో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, ఈశ్వర్ కుటుంబీకులను పరామర్శించారు. ఈశ్వర్ మృతిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment