
ట్రైన్‌లో వస్తాడు.. దోచుకొని వెళ్తాడు
సిద్దిపేటఅర్బన్: జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట దొంగను సిద్దిపేట త్రీటౌన్ పోలీసులు పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. సిద్దిపేట త్రీటౌన్ సీఐ విద్యాసాగర్ కథనం మేరకు.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన గుర్రం అఖిల్ అలియాస్ తాడిశెట్టి మణికంఠ (32) 11 ఏళ్ల వయస్సు నుంచే దొంగతనాలకు అలవాటు పడ్డాడు. గత నెల 29న సిద్దిపేటలోని పొన్నాల వై జంక్షన్ వద్ద గల వైన్స్ పైకప్పు రేకులను తొలగించి రూ.30 వేల నగదు, రెండు మద్యం సీసాలను దొంగిలించాడు. చోరీ ఘటనపై వైన్స్ యజమానులు త్రీటౌన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై చంద్రయ్య, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ అంజయ్య ఆధ్వర్యంలో సిబ్బంది యాదగిరి, ప్రవీణ్, శివ, నగేశ్ ప్రత్యేక బృందంగా ఏర్పడి వెతుకుతున్నారు. సోమవారం సాయంత్రం పొన్నాల వై జంక్షన్ వద్ద హైదరాబాద్ బస్సు కోసం వేచి ఉన్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారిచంగా వైన్స్‌లో దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడు.
సికింద్రాబాద్‌కు ట్రైన్‌లో వచ్చి దొంగతనాలు
ఇదిలా ఉండగా నిందితుడు 2012లో ఏపీలోని హుండీ పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగతనం కేసులో పట్టుబడి బాల నేరస్తుడిగా శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలై 2021లో తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసి పట్టుబడి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లాడు. మళ్లీ జైలు నుంచి విడుదలై 2025 జనవరిలో సికింద్రాబాద్‌కు ట్రైన్‌లో మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెయింట్ షాపులో ల్యాప్‌టాప్, మొబైల్, కొంత నగదు దొంగతనం చేసి, ఆ వస్తువులను అమ్మగా వచ్చిన డబ్బులతో ఇంటికి వెళ్లిపోయాడు. మళ్లీ డబ్బులు అయిపోగానే సికింద్రాబాద్‌కు ట్రైన్‌లో వచ్చి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో హార్డ్‌వేర్ షాపులో ట్యాబ్, కౌంటర్‌లోని నగదు, మొబైల్ దొంగిలించి విక్రయించగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. డబ్బులు అయిపోగా మళ్లీ గత నెల 29న సికింద్రాబాద్‌కు ట్రైన్‌లో వచ్చి అక్కడి నుంచి సిద్దిపేటకు వచ్చి వైన్‌షాపులో దొంగతనం చేశాడు. జల్సాలకు డబ్బులు లేని సమయంలో ఇలా ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్ వచ్చి పరిసర ప్రాంతాల్లో దొంగతనం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
వివరాలు వెల్లడిస్తున్న త్రీటౌన్ సీఐ విద్యాసాగర్
సిద్దిపేట వైన్స్‌లో రూ.30 వేలు,మద్యం సీసాలు దొంగతనం
జల్సాలకు అలవాటు పడి నిత్యం చోరీలు
పోలీసుల అదుపులో అంతర్రాష్ట దొంగ