
సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలి
కొల్చారం(నర్సాపూర్): మండల కేంద్రం కొల్చారంలో డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు, అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యను ప్రజలు, యువత సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఎస్సీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సోమవారం గ్రామంలో వివాదాస్పదంగా మారిన అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు, శివాజీ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి స్థలంను వెంకటయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ను, శివాజీ మహారాజ్‌ను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మొదట పెట్టిన అంబేడ్కర్ విగ్రహాన్ని తీసివేయాలనడం సబబు కాదన్నారు. ముందస్తుగానే గ్రామస్తులు ఈ విషయమై చర్చించుకోవాల్సి ఉండేదన్నారు. విగ్రహం ఎదుట మరో విగ్రహం ఏర్పాటు చేయడం ఇబ్బంది కలిగించడమేనని పేర్కొన్నారు. ఎస్పీ, కలెక్టర్ ఈ విషయంలో గ్రామస్తులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్‌ఐ మహమ్మద్ గౌస్,దళిత సంఘాల నాయకులు ఉన్నారు.
ఎస్సీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య
కొల్చారంలో విగ్రహ ఏర్పాట్ల స్థల పరిశీలన