హుస్నాబాద్: టాయిలెట్లు కంపుకొడుతున్నాయి.. మీ ఇళ్లలో ఇలాగే ఉంటాయా అని కళాశాల అధ్యాపకులపై హుస్నాబాద్ సివిల్ కోర్టు జూనియర్ జడ్జి శివరంజని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రభుత్వ బాలికలు, బాలుర జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లోని టాయిలెట్ల నిర్వహణపై శుక్రవారం ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
అన్ని కళాశాలల్లో టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండటం చూసి జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నింటికి తాళాలు వేసి ఉండటం చూసి విస్మయం వ్యక్తం చేశారు. అధ్యాపకుల టాయిలెట్లు శుభ్రంగా ఉండి, విద్యార్థులవి అధ్వానంగా ఉండటంపై మండిపడ్డారు. కళాశాలకు ఇంకా విద్యార్థులు రావడం లేదని, అందుకే టాయిలెట్లు శుభ్రం చేయలేదని అధ్యాపకులు తెలిపారు. పిల్లలు వస్తేనే టాయిలెట్లు శుభ్రం చేస్తారా అని జడ్జి మందలించారు. కళాశాలలకు విద్యార్థులు వస్తేనే మీకు ఉద్యోగాలు ఉంటాయన్న విషమయం గుర్తుంచుకోవాలన్నారు. వారం రోజుల్లో మళ్లీ వస్తా, పరిస్థితి ఇలాగే ఉంటే హైకోర్టుకు రిపోర్టును పంపుతానని హెచ్చరించారు.
ఎన్సాన్‌పల్లి రెసిడెన్షియల్ కళాశాలలో..
సిద్దిపేటఅర్బన్: మండలంలోని ఎన్సాన్‌పల్లి రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాలను సిద్దిపేట కోర్టు సీనియర్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ స్వాతిరెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి మరుగుదొడ్లను ఆమె పరిశీలించారు. వీటి పరిస్థితిపై హైకోర్టుకు నివేదిక సమర్పిస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment