సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : గ్రూపు విభేదాలు, అంతర్గత కుమ్ములాటలతో నిత్యం వార్తలతో ఉండే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కమిటీల కిరికిరి కొనసాగుతోంది. ఆ పార్టీ మండల, పట్టణ అధ్యక్షుల నియామకంపై తారాస్థాయిలో రచ్చ జరుగుతోంది. పలు మండల, పట్టణ కమిటీలను ఏకపక్షంగా ప్రకటించారంటూ హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ను ముట్టడించగా, ఏకంగా పరస్పరం దాడులకు దిగు తున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. కాంగ్రెస్‌లో ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్యనేతల మ ధ్య ఉన్న విభేదాలు ఇప్పటి వరకు జిల్లా స్థాయిలోనే బట్టబయలు కాగా, ఇప్పుడు గాంధీభవన్ స్థాయిలో రచ్చ జరగడం చర్చనీయాంశంగా మారింది.
మెదక్ కమిటీలు నియామకం ఏకపక్షమంటూ..
మెదక్ నియోజకవర్గంలోని, మండల, పట్టణ అధ్యక్ష పదవుల నియామకం రచ్చకు దారితీసింది. ఈ కమిటీలను ఏకపక్షంగా నియమించారని ఆరోపిస్తూ టీపీసీసీ సభ్యుడు సుప్రభాత్‌రావు వర్గం ఏకంగా గాంధీభవన్‌ను ముట్టడించింది. కంఠారెడ్డి తిరుపతిరెడ్డిని డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ తెరపైకి తెచ్చారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం ఐదు సంవత్సరాలు ఒకే పదవిలో కొనసాగుతున్న వారిని తొలగించాలని మరో పీసీసీ నేత మ్యాడం బాలకృష్ణ వర్గం పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు.
‘ఆవుల’కు టీపీసీసీ షోకాజ్ నోటీసులు?
నర్సాపూర్ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం విషయంలో ఏకంగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్‌కుమార్‌పై దాడి జరగ్గా, ఆలస్యంగా వెలుగు చూసింది. టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఆవుల రాజిరెడ్డి వర్గానికి చెందిన నాయకులు పార్టీ చీఫ్ రేవంత్‌రెడ్డి నివాసం వద్ద ఏకంగా గాలిపై దాడి చేయడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సీరియస్‌గా తీసుకుంది. ఇందుకు బాధ్యులైన వెల్దుర్తి మండల పార్టీ మాజీ అధ్యక్షుడితో పాటు, మరో ముగ్గురుపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటనలో ఆవుల రాజిరెడ్డికి కూడా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.
తెల్లాపూర్ కమిటీ విషయంలో కాటాకు షాక్..
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పట్టణ అధ్యక్ష పదవి విషయంలోనూ వివాదం రాజుకుంది. ఈ కమిటీ విషయంలో నియోజకవర్గ ముఖ్య నాయకుడు కాటా శ్రీనివాస్‌గౌడ్ షాక్ తగిలింది. ముందుగా కాటా శ్రీనివాస్‌గౌడ్ అనుచరుడు రవీందర్‌ను తెల్లాపూర్ పట్టణ అధ్యక్షుడిగా నియమించినట్లు ప్రకటించారు. కానీ ఈ పదవికి చిలుకమర్రి ప్రభాకర్‌రెడ్డిని నియమిస్తున్నట్లు టీపీసీసీ నుంచి ఉత్తర్వులు రావడం పార్టీ వర్గాల్లో రచ్చకు దారితీసింది.
సిద్దిపేట డీసీసీపైనా తిరుగుబాటు బావుటా..
మండల, పట్టణ కమిటీల నియామకాల విషయంలో సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డిపైనా ఆయన వ్యతిరేక వర్గం తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. మండల, పట్టణ కమిటీల నియామకంలో ఏకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆ పార్టీ సీనియర్ నేత జశ్వంత్‌రెడ్డి వర్గం నాయకులు ఇటీవల గాంధీభవన్ ముట్టడించారు. నర్సాపూర్ బీఆర్‌ఎస్ పార్టీకి కోవర్టుగా వ్యవహరిస్తున్నారని జశ్వంత్‌రెడ్డి వర్గం ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment