కాలువలు తవ్వి ఆగం చేయొద్దు
● భూమికి భూమి ఇవ్వాల్సిందే ● ఆర్డీఓ ఎదుట రైతుల వినతి
అక్కన్నపేట(హుస్నాబాద్): భూములే సర్వస్వంగా నమ్ముకుని బతుకుతున్నామని, పచ్చని పంట పొలాల నడుమ డిస్ట్రిబ్యూటరీ కాలువలు తవ్వి ఆగం చేయొద్దని బాధిత రైతులు ఆర్డీఓ రామ్మూర్తికి విన్నవించారు. గౌరవెల్లి ప్రాజెక్టు కింద డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి భూసేకరణ కోసం అంతక్కపేటలో గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడారు. కెనాల్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధిత రైతులందరికీ భూమికి బదులు భూమి ఇవ్వాలని కోరారు. బహిరంగ మార్కెట్ విలువల ప్రకారం దాదాపు రూ.35 నుంచి 40లక్షల వరకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మొదట గౌరవెల్లి ప్రాజెక్టును నీటితో పూర్తిగా నింపిన తర్వాతే ఈ డిస్ట్రిబ్యూటరీ కాలువల త్వవకాలను చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. అలాగే ఈ డిస్ట్రిబ్యూటరీ కాలువలతో తమకు ఎలాంటి లాభాలు ఉండవని, సాగు చేసుకుంటున్న భూముల మధ్యలోంచి కాలువలు తీస్తే నష్టపోతామన్నారు.
రైతులు సహకరించాలి..
అనంతరం ఆర్డీఓ రామ్మూర్తి మాట్లాడుతూ ఈ గ్రామ పరిధిలో నాలుగు డిస్ట్రిబ్యూటరీ కాలువలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కాలువల నిర్మాణానికి రైతులు సహకరించాలన్నారు. కాలువల నిర్మాణంలో రైతులకు అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా రాసి ఇవ్వాలని, వాటిని తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. కాలువల నిర్మాణంతో అంతక్కపేటలో దాదాపు 13వందల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment