
ప్రజా పాలనను ఆశీర్వదించండి
హుస్నాబాద్‌రూరల్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నప్పటికి ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు ఇస్తున్నామని బీసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత ప్రభుత్వ పథకాలతో పాటు కొత్త పథకాలను అమలు చేస్తూ ప్రజాపాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. శనివారం హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల్లోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని, నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేశామని చెప్పారు. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా విద్యావేత్త నరేందర్‌రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. బీఆర్‌ఎస్ పోటీలో లేదు.., బీజేపీ అభ్యర్థిది మన ప్రాంతం కాదన్నారు. బీజేపీ అభ్యర్థి ఓటు అడిగితే మోదీ ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీయాలని చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ..తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, బొమ్మ శ్రీరాం చక్రవర్తి, కర్ణకంటి మంజులారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, ముత్యాల సంజీవరెడ్డి, మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సేవాలాల్ సేవలు శ్లాఘనీయం
గిరిజనుల ఆరాధదైవం సేవాలాల్ మహారాజ్ సేవలు శ్లాఘనీయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ బంజార భవన్‌లో ఏర్పాటు చేసి సంతు సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సేవాలాల్ ఆశయాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.
బీసీల 42 శాతం రిజర్వేషన్లకు చట్ట బద్ధత కల్పిస్తాం
హుస్నాబాద్: రాష్ట్రంలో మొదటిసారి కులగణన సర్వే చేశామని మంత్రి పొన్నం అన్నారు. శనివారం తన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాము వందశాతం కులగణన చేశామని, చెప్పడం లేదని, మిగిలిన 3శాతం జనాభాను సర్వేలో పాల్గొనేందుకు ఈ నెల 28వ తేదీ వరకు ప్రభుత్వం అవకాశం ఇస్తుందన్నారు. ప్రతిపక్షాలు సర్వేలో పాల్గొని, మిగతా వారు పాల్గొనే విధంగా అవగాహన కల్పించాలన్నారు. బీసీల జనాభా 52 శాతం ఉందని సర్వేలో తేలిందని, 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి అసెంబ్లీలో చట్టం చేస్తామన్నారు. బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధతకు మీరు మద్ధతు ఇస్తారా లేక, వ్యతిరేకిస్తారో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లి అడ్డుపడపితే ప్రధానిని కూడా వదలపెట్టబోమని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి
మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రజా పాలనను ఆశీర్వదించండి
Comments
Please login to add a commentAdd a comment