పాఠశాలల్లో సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
కోహెడరూరల్(హుస్నాబాద్): పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. తంగళ్లపల్లిలోని కస్తూర్బా గాంధీ(కేజీబీవీ) బాలికల విద్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. పాఠశాలలో సౌకర్యాలు, పరిశుభ్రత, టాయిలెట్స్ నిర్వహణ తదితర వాటిని పరిశీలించారు. వంట సామగ్రి, తరగతి గదుల నిర్వహణ, భోజన వసతుల ఏర్పాటు, విద్యార్థుల ఆరోగ్యం, నీటి సరఫరా తదితర వాటిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా పదో తరగతి గదిలోకి వెళ్లి గణిత సబ్జెక్ట్ బోధించారు. పైథాగరస్ సిద్ధాంతం గురించి వివరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ సురేఖ, మండల విద్యాధికారి ఆర్, పద్మయ్య, కేజీబీవీ ప్రత్యేకాధికారి హిమబిందు, ఎంపీఓ శోభ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment