జిల్లా అధ్యక్షుడి ఎన్నికపై కినుక.. సీనియర్లు అలక | - | Sakshi
Sakshi News home page

జిల్లా అధ్యక్షుడి ఎన్నికపై కినుక.. సీనియర్లు అలక

Published Fri, Feb 21 2025 9:18 AM | Last Updated on Fri, Feb 21 2025 9:14 AM

జిల్లా అధ్యక్షుడి ఎన్నికపై కినుక.. సీనియర్లు అలక

జిల్లా అధ్యక్షుడి ఎన్నికపై కినుక.. సీనియర్లు అలక

● ఎమ్మెల్సీ ఎన్నికల వేళ పార్టీలో అయోమయం ● ఎంపీ తీరని అన్యాయం చేశారంటూ ఓ నేత కంటతడి ● భవిష్యత్‌ కార్యాచరణపై ముఖ్యనేతల చర్చలు ● బుజ్జగింపు చర్యల్లో అధిష్టానం ● అసంతృప్తులపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ గురి

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కమలంలో ముసలం మొదలైంది. జిల్లా అధ్యక్షుడి నియామకంపై సీనియర్లు అలకబూనారు. ఏళ్లుగా ఎన్నో కష్టాలు.. ఆర్థికంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటూ పార్టీని నమ్ముకొని వస్తున్న తమకు అన్యాయం జరగడంపై సీనియర్‌ నేతలు భగ్గుమంటున్నారు. 30 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తున్న తమను కాదని కేవలం మూడు, నాలుగేళ్ల క్రితం పార్టీలో చేరిన వ్యక్తికి జిల్లా పగ్గాలు అప్పగించడంపై జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో కొందరు నేతలు భవిష్యత్‌ కార్యాచరణపై చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ అసంతృప్తులను తమవైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు దృష్టిసారించాయి.

దుబ్బాక: బీజేపీ జిల్లా అధ్యక్ష పీఠాన్ని కొందరు పార్టీ సీనియర్‌ నేతలు ఏళ్లుగా ఆశిస్తున్నారు. ప్రస్తుత పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబటి బాలేశ్‌గౌడ్‌, మాజీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు గురువారెడ్డి, బైరి శంకర్‌ ముదిరాజు, పార్లమెంట్‌ కో కన్వీనర్‌ నలగామ శ్రీనివాస్‌ పోటీపడ్డారు. రెండు నెలలుగా జిల్లా అధ్యక్షుడి నియామకంపై అధిష్టానం మల్లగుల్లలు పడుతూ వచ్చి ఈ నెల 18న రాత్రి బైరి శంకర్‌ ముదిరాజును నియమించింది. దీంతో జీర్ణించుకోలేని సీనియర్లు బాహాటంగానే పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

భవిష్యత్‌ కార్యాచరణపై సమాలోచనలు

తమకు అన్యాయం జరగడంపై పార్టీ సీనియర్లు ముమ్మరంగా చర్చలు సాగిస్తున్నారు. కొత్తగా ఎన్నికై న అధ్యక్షుడిపై బహిరంగంగానే సీనియర్‌ నాయకులు విమర్శలు గుప్పిస్తుండటం శోచనీయం. నమ్ముకున్న వారే తమను నట్టేట ముంచారంటూ ఆరోపిస్తున్నారు. చివరివరకు అధ్యక్ష పదవిని ఆశించిన బాలేశ్‌గౌడ్‌తో పాటు పలువురు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ అనుచరులతో ప్రత్యేకంగా సమావేశమై తగిన నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

అధిష్టానం ప్రత్యేక దృష్టి

జిల్లా బీజేపీలో నెలకొన్న అసంతృప్తిపై అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. అసంతృప్తులతో రాష్ట్ర ముఖ్య నాయకుడు ఫోన్‌లో మాట్లాడుతూ బుజ్జగిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర నాయకులు బిజీగా ఉన్నారు. దీంతో ఎన్నికల తర్వాత కలిసి మాట్లాడుకుందామని, అంత వరకు ఓపిక పట్టాలంటూ బుజ్జగింపు చర్యలు చేపడుతున్నారు. అధిష్టానానికి చెందిన ముఖ్యనేతలు ఎప్పటి కప్పుడు జిల్లాపై దృష్టి సారించి పరిస్థితి చేయిదాటకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జిల్లాలో నెలకొన్న పరిస్థితిపై అధిష్టానం సైతం తీవ్ర కలవరపాటు చెందుతున్నట్లు తెలిసింది.

కమలంలో ముసలం

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ గాలం

అసంతృప్తితో ఉన్న బీజేపీ ముఖ్య నాయకులతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు టచ్‌లో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీలో చేరేలా జిల్లాకు చెందిన మంత్రి ప్రత్యేక దృష్టి సారించినట్లు వినికిడి. బీఆర్‌ఎస్‌ నేతలు సైతం తమ పార్టీలోకి వస్తే భవిష్యత్‌ బాగుంటుందనే ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిసింది. ఎంపీ రఘునందన్‌రావు ముఖ్య అనుచరుడిగా పేరొందిన రాష్ట్ర నాయకుడిపై మంత్రి ప్రత్యేకంగా ఫోకస్‌పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బాలేశ్‌గౌడ్‌ కంటతడి..

30 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న తనకు ఎంపీ రఘునందన్‌రావే అధ్యక్ష పదవి రాకుండా అన్యాయం చేశారంటూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు అంబటి బాలేశ్‌గౌడ్‌ సన్నిహితుల వద్ద కంటతడిపెట్టినట్లు సమాచారం. రెండు పర్యాయాలు తనకు అన్యాయమే జరిగిందని, ఈ సారి పక్కా అంటూ ఎంపీ మోసం చేశారంటూ అనుచరులతో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సోషల్‌ మీడియాలో సైతం బాలేష్‌గౌడ్‌తో పాటు పార్టీ క్యాడర్‌ చాలా మంది ఎందుకిలా చేశారంటూ పోస్టులు పెట్టడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా జిల్లా బీజేపీలో నెలకొన్న అసంతృప్తి సెగలు అధిష్టానం ఎలా చల్లారుస్తుందో వేచి చూడాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement