
పౌష్టికాహారం సక్రమంగా అందించండి
● నిత్యం మెనూను అమలు చేయండి ● కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ● బీసీ సంక్షేమ వసతి గృహాలఅధికారులతో సమావేశం
సిద్దిపేటరూరల్: జిల్లాలోని అన్ని వసతి గృహాలు, పాఠశాలల్లో కామన్ డైట్ మెనూ తప్పకుండా అమలు చేయాలని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం బీసీ వెల్ఫేర్ వసతి గృహ సంక్షేమ అధికారులతో కలెక్టరేట్‌లో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఉదయం వివిధ రకాల ఆల్పాహార పదార్థాలను వండేందుకు సరిపడా వంట పాత్రలు లేవని వాటిని సమకూర్చాలని, కూరగాయలు, నాన్ వెజ్, ఫ్రూట్స్, పాలు, పెరుగు టెండర్ ద్వారా హాస్టళ్లకు సరఫరా చేయాలని హెచ్‌డబ్ల్యూఓలు కలెక్టర్‌ను కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థులు బలంగా, ఆరోగ్యంగా ఎదిగేందుకు ప్రభుత్వం రూపొందించిన కామన్ డైట్ మెనూ తప్పకుండా అందించాలన్నారు. మార్కెట్లో అన్ని రకాల కాయకూరలు, ఆకుకూరలు అందుబాటులో ఉన్నాయన్నారు. రోజు ప్రతీ పూటకు సూచించిన ఆహార పదార్థాలను మాత్రమే అందించాలన్నా రు. త్వరలో హాస్టళ్లకు వంట పాత్రలను సరఫరా చేస్తామన్నారు. జిల్లాలోని అన్ని బీసీ వెల్ఫేర్ హాస్టళ్లను సందర్శించి సమస్యలను తెలుసుకొని నివేదిక అందించాలని జిల్లా ఇన్‌చార్జి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, డీఆర్వో నాగరాజమ్మను ఆదేశించారు.
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌కు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సీపీ అనురాధతో కలిసి విద్య, రెవెన్యూ, పోలీస్, రవాణా, వైద్య, విద్యుత్, పోస్టల్ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 5 నుంచి జరిగే వార్షిక పరీక్షల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 43 పరీక్షా కేంద్రాల్లో 20,595 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చీఫ్ సూపరింటెండెంట్స్, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసి నిఘా పెట్టాలన్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి, కస్టోడియన్ , డిపార్ట్‌మెంటల్ అధికారులను నియమించాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గురకుల పాఠశాల, కళాశాల సందర్శన
పాఠశాలల్లో తప్పకుండా మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. శుక్రవారం చిన్నగుండవెల్లి శివారులోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల, కళాశాల ప్రాంగణంలోని తరగతి గదులను, భోజనశాలను పరిశీలించారు. అనంతరం పదో తరగతి, ఇంటర్ విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షలకు సన్నద్ధతపై వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ భాను ప్రకాష్, తహసీల్దార్ సలీం , మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్, జిల్లా వైద్యాధికారి పల్వాన్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment