
అధిష్టానం వద్దకు కమలం కయ్యం
తీవ్ర చర్చనీయాంశమైనసాక్షి కథనం
● రాష్ట్ర కార్యాలయానికి వెళ్లినసీనియర్ నేతలు ● ‘యెండెల’తో ప్రత్యేక భేటీ ● నడ్డాకు, ముఖ్యనేతలకూ మెయిల్ ద్వారా ఫిర్యాదు
దుబ్బాక: ‘కమలంలో ముసలం..’ శీర్షికన శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన కథనం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సిద్దిపేట జిల్లా అధ్యక్షుడి ఎన్నికపై సీనియర్లు అలక బూనిన విషయం విదితమే. ఈ క్రమంలో అధిష్టానం సీరియస్‌గా దృష్టి సారించి పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నాలు సారించినట్లు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియాతో మాట్లాడవద్దంటూ, ఎమ్మెల్సీ ఎన్నికలు అయ్యే వరకు ఓపిక పట్టాలంటూ అసంతృప్తితో ఉన్న సీనియర్లకు రాష్ట్ర ముఖ్య నాయకులు సూచించినట్లు సమాచారం.
రాష్ట్ర సంఘటన కార్యదర్శిని కలిసిన నేతలు
జిల్లాలోని బీజేపీ సీనియర్ నాయకులు బాలేశ్‌గౌడ్, విద్యాసాగర్, గురువారెడ్డి, కాన్గంటి శ్రీనివాస్, రోశయ్య, మల్లేశంతోపాటు సుమారు వంద మందికి పైగా ముఖ్యనాయకులు శుక్రవారం హైదరాబా ద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలివెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర పంఘటన కార్యదర్శి చంద్రశేఖర్‌జీని కలిసి జిల్లా అధ్యక్షుడి ఎన్నికలో జరిగిన పరిణామాలపై విన్నవించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి యెండెల లక్ష్మీనారాయణతోనూ భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తికాగానే ఈ అంశంపై పూర్తిస్థాయిలో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
కేంద్ర మంత్రులకూ ఫిర్యాదు
జిల్లాలో బీజేపీ అధ్యక్షుడి నియామకంపై జాతీయ అధ్యక్షుడు నడ్డాతోపాటు ముఖ్య నాయకులకు ఫిర్యాదు చేశారు. జిల్లా అధ్యక్షుడి నియామకాన్ని ఏ ప్రాతిపదికన జరిగిందని, 30 ఏళ్లకు పైబడి పార్టీలో పనిచేస్తున్న తమను కాదని కనీసం పార్టీలో క్రీయాశీలక సభ్యత్వం కూడా లేని వ్యక్తిని ఎలా అధ్యక్షుడిగా నియమిస్తారని అందులో పేర్కొన్నట్లు సమాచారం. నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీ రఘునందన్‌రావు లకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఏదేమైనా జిల్లా బీజేపీలో చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment