
ఉగాదికి సన్న బువ్వ!
బియ్యం పంపిణీకి సన్నద్ధం
● తొలి విడతలో 12,471 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లింగ్ ● జిల్లాలో 2.91 లక్షలకుపైగా రేషన్ కార్డులు ● ప్రతి నెలా 5 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం
రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీకి అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన సన్న వడ్ల మిల్లింగ్‌పై పౌరసరఫరాల శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. ఉగాది నుంచి పంపిణీకి కసరత్తు జరుగుతోంది. పేదలకు రేషన్ కార్డులపై ప్రస్తుతం దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుండగా ఆ స్థానంలో సన్నబియ్యం ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వానాకాలంలో 419 కొనుగోలు కేంద్రాల ద్వారా మొత్తం 2,51,766 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, అందులో 9,679 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం ఉంది.
సాక్షి, సిద్దిపేట: రేషన్ కార్డుదారులకు ఉగాది పండగ రోజు సన్నబియ్యం పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల భోజనానికి ఇప్పటికే సన్నబియ్యం వినియోగిస్తున్నారు. జిల్లాలో 2,92,139 రేషన్ కార్డులు ఉండగా అన్నపూర్ణ 82, అంత్యోదయ 18,337, ఆహార భద్రత కార్డులు 2,73,720 ఉన్నాయి. వీటికి నెలకు సుమారుగా 5వేల మెట్రిక్ టన్నుల బియ్యం కాగా సంవత్సరానికి సుమారుగా 60వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం కానున్నాయి.
12,471 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లింగ్
జిల్లాలో 9,679 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం రాగా, మెదక్ జిల్లాకు చెందిన 6,403మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సిద్దిపేటకు కేటాయించారు. మొత్తంగా తొలివిడతలో 16,082 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం వచ్చింది. అందులో నుంచి 3,611టన్నుల ధాన్యాన్ని విద్యార్థుల హాస్టల్స్, మధ్యాహ్న భోజనానికి కేటాయించారు. మిగిలిన 12,471 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 52 మిల్లులకు కేటాయించారు. కస్టమ్ మిల్లింగ్ ద్వారా ఒక్కో క్వింటాల్ ధాన్యానికి 67కిలోల బియ్యం ఇచ్చేలా మిల్లర్లతో అగ్రిమెంట్ చేశారు.
ఇక రీసైక్లింగ్‌కు చెక్
కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికీ నెలకు 6కిలోల చొప్పున దొడ్డు బియ్యం ప్రభుత్వం అందజేస్తోంది. అయితే తినేందుకు ఆసక్తి చూపని పేద, మధ్య తరగతి వర్గాల వారు ఆ బియ్యాన్ని కిలో రూ.10 నుంచి రూ.15 చొప్పున దళారులకు విక్రయిస్తున్నారు. ఈ బియ్యం తిరిగి రైస్ మిల్లులకు చేరుతోంది. మిల్లులు ఈ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ కింద ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. రేషన్ షాప్‌ల ద్వారా సన్న బియ్యం పంపిణీ ప్రారంభిస్తే వినియోగించుకుంటారని, బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించవచ్చని ప్రభుత్వ భావిస్తోంది.
సన్నబియ్యం పంపిణీకి సిద్ధం చేస్తున్నాం
వానాకాలంలో సన్న ధాన్యాన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేశాం. రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ధాన్యాన్ని మిల్లర్లకు సీఎంఆర్ కోసం కేటాయించాం. వాటిని త్వరగా మిల్లింగ్ చేసే విధంగా కృషి చేస్తాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే సన్న బియ్యం పంపిణీ ప్రారంభిస్తాం.
– ప్రవీణ్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్

ఉగాదికి సన్న బువ్వ!
Comments
Please login to add a commentAdd a comment