
ఏసీబీ వలలో రెవెన్యూ చేప
● సిద్దిపేటలో దుబ్బాక ఆర్‌ఐ పట్టివేత ● రూ.లక్ష నగదు స్వాధీనం ● వారసత్వ పట్టా మార్పు కోసంలంచం డిమాండ్
సిద్దిపేటజోన్: భూమికి సంబంధించి వారసత్వ పట్టా మార్పు కోసం లక్ష నగదు లంచంగా తీసుకుంటూ దుబ్బాక ఆర్‌ఐ నర్సింహారెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టబడ్డాడు. సిద్దిపేట పట్టణం బీజేఆర్ చౌరస్తాలోని ఒక టీ స్టాల్ వద్ద బుధవారం సాయంత్రం బాధితుల నుంచి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. నర్సింహారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. లక్ష నగదు స్వాధీనం చేసుకుని దుబ్బాక తహశీల్దార్ కార్యాలయానికి ఏసీబీ అధికారులు తరలించారు. దుబ్బాక మండలం అప్పన్న పల్లికి చెందిన 257, 259, 266, 275, 287 సర్వే నంబర్లలో ఉన్న 3 ఎకరాల 25 గుంటల భూమికి సంబంధించి వారసత్వ పట్టా మార్పు కోసం కుంభాల సుజాత, రాజిరెడ్డి నుంచి రూ.లక్ష డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితులు ఏసీపీ అధికారులను ఆశ్రయించారు. ఆర్‌ఐ నర్సింహారెడ్డికి డబ్బు ఇవ్వగా.. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
తహీసీల్దార్ కార్యాలయంలో సోదాలు..
దుబ్బాక: తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. లంచం తీసుకుంటూ సిద్దిపేటలో పట్టుబడ్డ ఆర్‌ఐ నర్సింహరెడ్డిని ఏసీబీ అధికారులు బుధవారం రాత్రి దుబ్బాక తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చి పలు కోణాల్లో ప్రశ్నించారు. భూముల వివరాలతో పాటు పలు రికార్డులను తనిఖీ చేశారు. సిద్దిపేటలోని ఆర్‌ఐ నర్సింహరెడ్డి ఇంట్లో సైతం ఏసీబీకి చెందిన మరో టీం సోదాలు చేస్తున్నట్లు తెలిసింది. రాత్రంతా కార్యాలయంలో తనిఖీలు చేపడతామని తమ సోదాలు పూర్తి అయ్యాకే వివరాలు వెల్లడిస్తామంటూ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. ఆర్‌ఐ నర్సింహరెడ్డిపై గతంలోనూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినట్లు సమాచారం.

ఏసీబీ వలలో రెవెన్యూ చేప
Comments
Please login to add a commentAdd a comment