
రక్త నిల్వలు ఖాళీ!
జిల్లాలోని బ్లడ్ బ్యాంక్‌లో రక్త నిల్వలు ఖాళీ అవుతున్నాయి. రోజుకు పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు.. సుమారు 30 మంది మహిళలు పురుడు పోసుకుంటున్నారు. ఇందులో చాలా మందికి రక్తం అవసరం అవుతోంది. తలసేమియా బాధితులకు సైతం పదిహేను రోజులకొకసారి రక్తం ఎక్కించాల్సి ఉంటోంది. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. జీజీహెచ్(ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి)లో బ్లడ్ బ్యాంక్ ఉంది. ఇందులో నిల్వలు తగ్గడంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు.
ఏబీ నెగిటివ్ స్టాక్ నిల్
● బ్లడ్ బ్యాంక్‌లో 60 యూనిట్లే నిల్వ ● వచ్చేది వేసవి కాలం మరింత తగ్గే అవకాశం ● రక్తదాన శిబిరాలు నిర్వహించాలంటున్న అధికారులు
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో రక్తనిల్వలు తగ్గడంతో వేసవిలో ప్రమాద ఘంటికలు మోగే పరిస్థితులున్నాయి. కొరతను అధిగమించేందుకు దాతల సహకారం అవసరం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఉచితంగా రక్తం కావాలంటే ఇతరుల నుంచి సేకరించి ఇవ్వాల్సి వస్తోంది. జీజీహెచ్‌లో ఏబీ నెగిటివ్ బ్లడ్ స్టాక్ లేదు. బ్లడ్ బ్యాంక్ మొత్తంగా 60 యూనిట్‌ల రక్తం మాత్రమే నిల్వ ఉంది. అందులో ఏబీ పాజిటివ్ 6, ఓ పాజిటివ్ 18, బీ పాజిటివ్ 15, ఏ పాజిటివ్ 11, ఏ నెగిటివ్ 1, ఓ నెగిటివ్ 2 యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. రక్తం కొరత ఉండటంతో బ్లడ్ అవసరం ఉన్న వారి తరుపున ఒకరు డోనేట్ చేస్తే సర్దుబాటు చేస్తున్నారు. దీంతో డోనర్ కోసం రోగి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రంగా కొరత ఉండే నెగిటివ్ గ్రూప్‌లకు సంబంధించిన ఫోన్ నంబర్‌లకు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ఫోన్‌లు చేసి పిలిపిస్తున్నారు.
ఎవరు ఇవ్వొచ్చంటే..
18–55 వయసు ఉండి.. 50 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్న వారే రక్తదానం చేయాలి. మనిషి శరీరంలో సుమారు 5లీటర్ల వరకు రక్తం ఉంటుంది. 350 మిల్లీ లీటర్ల మేర రక్తం సేకరిస్తారు. రక్తదానం చేయడంతో శరీరంలో ఐరన్, మినరల్ లెవెల్స్ సమస్థాయిలో ఉండి, శరీరానికి మేలు చేస్తాయి.
స్వచ్ఛంద సంస్థలు స్పందించాలి
రక్త నిల్వలు సమకూరేందుకు యువత, రాజకీయ పార్టీ నేతలు, సినీ హీరో అభిమానులు, స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. వచ్చేది వేసవి కాలం కావడంతో విద్యార్థులకు సెలవులు ఉండనున్నాయి. రక్తం కొరత నుంచి గట్టెక్కించ్చేందుకు ప్రభుత్వ ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్‌లో రక్తదాన శిబిరాలను నిర్వహించాలి. యువత, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నేతలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్యులు కోరుతున్నారు.
దాతలు ముందుకు రావాలి...
రక్తదానం చేసేందుకు దాతలు ముందుకు రావాలి. పోలీసు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, వివిధ సంఘాలు, విద్యార్థులచే క్యాంప్‌లను ఏర్పాటు చేసి బ్లడ్‌ను సేకరించనున్నాం. రక్తదానం చేస్తే ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడిన వారు అవుతారు. ప్రస్తుతం బ్లడ్ బ్యాంక్‌లో రక్తం కొరత లేదు.
– డాక్టర్ శ్రావణి, మెడికల్ ఆఫీసర్,
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్
సంవత్సరం సేకరించిన యూనిట్‌లు2017 2,500 2018 2,840 2019 3,210 2020 2,200 2021 2,848 2022 3,266 2023 2,950 2024 2,736 2025 ఇప్పటి వరకు 285

రక్త నిల్వలు ఖాళీ!
Comments
Please login to add a commentAdd a comment