డైలమాలో పౌల్ట్రీ రైతులు | - | Sakshi
Sakshi News home page

డైలమాలో పౌల్ట్రీ రైతులు

Published Mon, Feb 17 2025 7:20 AM | Last Updated on Mon, Feb 17 2025 7:20 AM

డైలమా

డైలమాలో పౌల్ట్రీ రైతులు

● బర్డ్‌ ఫ్లూ దెబ్బతో విలవిల ● ఉత్పత్తుల తరలింపులోనూ తీవ్ర జాప్యం ● ఉమ్మడి మెదక్‌ జిల్లాలో దుస్థితి ● తెలుగు రాష్ట్రాల కోళ్ల ఉత్పత్తుల్లోసింహభాగం ఇక్కడే

గజ్వేల్‌: పౌల్ట్రీ రంగాన్ని తరుచూ ఏదో అంశం కుదిపేస్తూనే ఉంది. తాజాగా బర్డ్‌ఫ్లూ ప్రచారంతో ఈ పరిశ్రమకు గట్టి దెబ్బే తగలింది. ఉమ్మడి మెదక్‌ జిల్లా(సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌)లో వ్యవసాయ రంగం తర్వాత రెండో అతిపెద్ద పరిశ్రమగా పౌల్ట్రీ వెలుగొందుతోంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉత్పత్తులను ఈ ప్రాంతం అందిస్తున్నది. పౌల్ట్రీపై ప్రతి నెలా వందల కోట్ల రూపాయల మేర లావాదేవీలు సాగుతున్నాయి. ఎంతోమంది రైతులు దశాబ్దాలుగా సొంతంగా పరిశ్రమను నిర్వహిస్తున్నారు. పౌల్ట్రీనే తమ జీవితంగా మలుచుకున్నారు.

కంపెనీల మాయాజాలం

ఇంటిగ్రేషన్‌ కంపెనీల మాయాజాలంతో సొంతంగా పౌల్ట్రీ పరిశ్రమను నిర్వహిస్తున్న రైతులను కుంగదీస్తున్నది. రైతు నుంచి తక్కువ ధరకు కోళ్లను కొనుగోలు చేస్తున్న కంపెనీలు బహిరంగ మార్కెట్‌లో ధరలు పెంచి అమ్ముకుంటున్నాయి. ఇకపోతే జిల్లాలో వేలాది మంది రైతులు సుగుణ, వెంకటేశ్వర, డైమాండ్‌, జాప్నవి, జానకీ, ఎస్‌ఆర్‌, స్నేహా, విమల తదితర ఇంటిగ్రేషన్‌ సంస్థల భాగస్వామ్యంతో పౌల్ట్రీ పరిశ్రమ నడుపుతున్నారు. ఈ సంస్థలతో పరిశ్రమను నడుపుకోవాలనుకుంటే రైతులు షెడ్‌, లేబర్‌, కరెంట్‌, నీరు వంటి మౌలిక వసతులను కల్పించాల్సి ఉంటుంది. దీనికి ఒక్కో కోడిపై కిలోకు రూ.5–6కుపైగా చెల్లిస్తాయి. నిర్వహణ బాగుంటే మరో 50పైసలు అదనంగా చెల్లిస్తారు. ఇదిలాఉంటే ఇంటిగ్రేటెడ్‌ సంస్థల ఒప్పందం ప్రకారం ఉత్పాదక వ్యయం భారీగా పెరిగితే మాత్రం రైతులు నష్టాలు భరించాల్సి ఉంటుంది. 5శాతం కోళ్లకంటే ఎక్కువగా మృత్యువాతపడితే నష్టాలను రైతులే భరించాలి. విద్యుత్‌ ఛార్జీల రూపేణా 5వేల కోడిపిల్లల సామర్థ్యం కలిగిన షెడ్‌కు 45రోజులకు రూ.5వేలపైనే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. వీటన్నింటినీ మినహాయిస్తే ఈ సంస్థల భాగస్వామ్యంతో కోళ్లను పెంచుతున్న రైతులకూ మిగులుతున్నది అంతంతమాత్రమే. ఫౌల్ట్రీ రంగంలో వరుసగా వస్తున్న నష్టాలను నియంత్రించడానికి రైతులకు కరెంట్‌, దాణాలో సబ్సిడీ ఇవ్వాలనే డిమాండ్‌ ఎన్నోఏళ్లుగా ప్రభుత్వం ముందు ఉన్నది. కానీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం వెలువడటంలేదు.

బర్డ్‌ ఫ్లూ దెబ్బతో పౌల్ట్రీ పరిశ్రమ విలవిల్లాడుతోంది. సొంతంగా పరిశ్రమను నడుపుకుంటున్నవారు తీవ్రంగా నష్టపోయారు. వీరంతా కోళ్ల ఉత్పత్తిని తిరిగి ప్రారంభించాలా? వద్దా? అనే డైలమాలో పడ్డారు. మరోవైపు ఇంటిగ్రేషన్‌ రైతులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. బర్డ్‌ ఫ్లూ ప్రచారం నేపథ్యంలో కంపెనీలు ఉత్పత్తులను లిఫ్టింగ్‌ చేయడానికి సమయం తీసుకుంటున్నాయి. దీనివల్ల నిర్వహణ భారం రైతులకు తప్పడం లేదు. కోళ్ల ఉత్పత్తుల్లో తెలుగు రాష్ట్రాల్లోనే అగ్రగామిగా వర్ధిల్లుతున్న ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పరిస్థితి ఇది.

ఉత్పత్తిని తాత్కాలికంగా ఆపేశా..

30 ఏళ్లుగా పౌల్ట్రీ రంగంలో ఉన్నాను.16వేల కోళ్ల సామర్థ్యం గల షెడ్డు నిర్వహిస్తున్నా. 15 రోజుల కిందటే అన్ని కోళ్లను అమ్మేశాను. ప్రస్తుతం బర్డ్‌ఫ్లూ ప్రచారం నేపథ్యంలో కొత్త కోడిపిల్లల ఉత్పత్తిని ఆపేద్దామని నిర్ణయించుకున్నా. పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి ఉత్పత్తిని ప్రారంభిస్తా.

– వెంకట్‌రెడ్డి పౌల్ట్రీఫామ్‌ నిర్వాహకుడు, ఇందుప్రియాల్‌, దౌల్తాబాద్‌ మండలం

ఒక్కో కోడిపై రూ.195కుపైగా ఖర్చు..

సాధారణంగా కోడి పిల్లలను 45రోజులు పెంచుతారు. చిక్స్‌ రూ.45, దాణాకు (కోడి పెరిగేంతవరకు) రూ.140, ఇతర ఖర్చులు మరో రూ. 10కి పైగా ఖర్చు అవుతున్నది. ఈ లెక్కన ఒక్కో కోడిని ఉత్పత్తి చేయడానికి అన్నీ కలుపుకొని రూ.195కిపైగా ఖర్చవుతున్నది. సుమారు రెండు కిలోలకుపైగా బరువుండే లైవ్‌ బర్డ్స్‌ ధర రూ.220కి పైగా పలికితే నష్టాలు ఉండవు. కానీ ప్రస్తుతం బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో లైవ్‌ బర్డ్‌ ధర రైతుల నుంచి తీసుకెళ్లే కంపెనీలు కిలోకు రూ.52 మాత్రమే చెల్లిస్తున్నాయి. అంటే రెండు కిలోల బరువుంటే లైవ్‌ బర్డ్‌కు రూ.104మాత్రమే ధర దక్కుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో సొంతంగా పరిశ్రమను నడుపుకునేవారు లక్షల్లో నష్టాలు చవిచూస్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారంతా ప్రస్తుతం కొత్త కోడి పిల్లల ఉత్పత్తిని ఆపేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
డైలమాలో పౌల్ట్రీ రైతులు 
1
1/1

డైలమాలో పౌల్ట్రీ రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement