సమస్యల పరిష్కారంపై సీఎం హామీ
● ఉద్యోగులతో మార్చిలో ప్రత్యేక సమావేశం ● టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్
సిద్దిపేటజోన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మార్చి మొదటి వారంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పరిష్కార చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్ పేర్కొన్నారు. బుధవారం సీఎంని హైదరాబాద్‌లో కలిసి కరీంనగర్ వెళ్తూ మార్గమధ్యలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డికి వివరించి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించాలని, పెన్షన్ బెనిఫిట్స్ రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. స్పందించిన సీఎం సీనియార్టీ ప్రకారం చెల్లింపు జరిగేలా చూస్తామని, ఏప్రిల్‌లో డీఏలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఉద్యోగుల అన్ని సమస్యలపై మార్చి మొదటి వారంలో ప్రత్యేకంగా సమీక్ష చేస్తానని సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారని సీఎంకు వివరించినట్లు తెలిపారు. ఎల్బీ స్టేడియంలో భారీ స్థాయిలో త్వరలో ఉద్యోగుల సమావేశం ఉంటుందని, టీఎన్జీవో ప్రతినిధులు రావాలని సూచించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు పరమేశ్వర్, కార్యదర్శి విక్రమ్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment