
చదువుతోపాటు నైపుణ్యం ముఖ్యం
● కష్టపడితే ఏదైనా సాధ్యమే ● మంత్రి పొన్నం ప్రభాకర్ ● నాగసముద్రాలలో మహాత్మాగాంధీ విగ్రహం ఆవిష్కరణ
కోహెడరూరల్(హుస్నాబాద్): విద్యార్థులకు చదువుతోపాటు నైపుణ్యం ఉంటే ఏదైనా సాధించవచ్చని బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండలంలోని నాగసముద్రాల గ్రామంలోని మోడల్ స్కూల్‌లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని కలెక్టర్ మనుచౌదరితో కలిసి ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో అహింసా పద్ధతిలో ఉద్యమాన్ని నడిపిన బాపూజీ విగ్రహాన్ని పాఠశాలలో ఆవిష్కరించుకోవడం ఆభినందనీయమన్నారు. మహనీయుల నుంచి స్ఫూర్తిని పొంది ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్ణయించుకుని వాటి సాధనకు నిరంతరం కష్టపడాలన్నారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడే 32 మండలాలకు గాను 29 మోడల్ స్కూల్ లు తీసుకువచ్చానన్నారు. స్కూల్స్‌లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వాతంత్య్ర చరిత్ర, తెలంగాణ ఉద్యమం, సైన్స్‌లపై అవగాహన అవసరమన్నారు. విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతి రోజు జరుగుతున్న అంశాలపై అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా మంత్రి ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. నాణ్యమైన ఆహారం అందించాన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పాతురి సుధాకర్‌రెడ్డి, గాంధీ జ్ఞాన్ ఫౌండేషన్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, ఆర్డీఓ రామూర్తి, తహసీల్దార్ సురేఖ, ఎంపీడీఓ కృష్టయ్య తదితరులు ఉన్నారు.
విద్యార్థుల సంఖ్యను పెంచండి
హుస్నాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు ధీటుగా తయారు చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం అన్ని మౌలిక వసతులు కల్పిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. తెలంగాణ భవిష్యత్‌కు విద్యార్థులే ఆస్తి అని అందరూ బాగా చదువుకొని భవిష్యత్‌కు పునాదులు వేయాలని మంత్రి కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, ఎంఈఓ బండారి మనీల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.