
నాణ్యమైన ఆహారం అందించాలి
దుబ్బాక: విద్యార్థులకు రుచికరమైన నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. బుధవారం దుబ్బాక మండలం హబ్షీపూర్‌లోని జ్యోతి బాపులే తెలంగాణ బీసీ బాలుర గురుకులాన్ని సందర్శించారు. వంట గదిలో అన్నం, కూరలను పరిశీలించి రుచి చూశారు. తాజా కూరగాయలను వాడాలని, వంటగది పరిసర ప్రాంతాలు ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, కొత్త డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని కోరారు. అనంతరం 8వ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను ఆప్యాయంగా పలకరించారు. సదుపాయాలు బాగున్నాయా అని అడిగారు. స్టడీ అవర్స్‌లో గణితం సమస్యలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలని సూచించారు. ప్రిన్సిపాల్ భూపాల్‌రెడ్డి గురుకులంలో 391 మంది విద్యార్థులు ఉంటున్నారని ఇందుకు సంబంధించి పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రభుదాసు, తహసీల్దార్ సంజీవ్‌కుమార్, ఎంపీడీవో భాస్కరశర్మ తదితరులు ఉన్నారు.
కలెక్టర్ మను చౌదరి