
మాకేది పరిహారం?
హుస్నాబాద్ డివిజన్ పరిధిలో3 వేల ఎకరాల్లో ఎండిన చేన్లు
● వట్టిపోయిన బోర్లు,చుక్క నీరు లేని బావులు ● వడగళ్లకు నష్టపోయినపంటలకే ఇస్తే ఎలా? ● ఎండిన పంటలకు సైతంఇవ్వాలని డిమాండ్ ● గౌరవెల్లి ప్రాజెక్ట్ కిందమెట్ట రైతులను వీడని కరువు
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు భైరి భిక్షపతి. గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితుడు. ప్రాజెక్టులో ఊరు గుడాటిపల్లె ముగిని పోతే ముల్లె మూట సర్దుకొని హుస్నాబాద్‌కు వచ్చి కిరాయి ఇంట్లో ఉంటున్నాడు. గాంధీనగర్‌లో మూడు ఎకరాలు సెలక కొని రూ.4 లక్షలు పెట్టి రెండు బోర్లు వేయించాడు. వానాకాలం బాగానే పంట వచ్చింది. ఈ యాసంగి వరి పెడితే ఒక బోరులో నీళ్లు లేక రెండు ఎకరాల వరి ఎండిపోయింది. బోరుకు తెచ్చిన బాకీలు రూ.2లక్షలు తీరకముందే రూ.60 వేల నష్టం వాటిల్లింది. గౌరవెల్లి ప్రాజెక్టుకు భూములు ఇచ్చి ఊరు విడిసిన గోదారి నీళ్లు రాకపాయే కరువు తప్పకపాదాయే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ మెట్ట ప్రాంతం ఊట బావులు, బోర్ల నీటి లభ్యత మేరకు రైతులు పంటలు సాగు చేస్తారు. డివిజన్ పరిధిలోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట, బెజ్జంకి, హుస్నాబాద్ మండలాల్లో యాసంగి 68,272 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తే 53,280 ఎకరాల్లో వరి పంటలను సాగు చేశారు. వానా కాలం వర్షాలు సమృద్ధి కురిసినా భూగర్భజలాలు ఫిబ్రవరిలోనే అడుగంటిపోవడంతో రైతుల పంట చేన్లకు నీరు అందక ఎండిపోయాయి. వ్యవసాయ అధికారులు మార్చి 11 వరకు 593 ఎకరాల పంటలు ఎండిపోయినట్లు అంచనా వేశారు. మీర్జాపూర్ క్లస్టర్ పరిధిలోనే 600 ఎకరాల వరకు పంటలు ఎండిపోయినట్లు రైతులు చెబుతున్నారు. హుస్నాబాద్ డివిజన్‌లో సుమారు 6 వేల ఎకరాల్లో వరి పంటలు ఎండిపోయాయి. వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించి రైతులు నష్టపోయిన పంటల వివరాలను నమోదు చేసుకొని నష్ట పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.
పంట నష్ట పరిహారం ఏది?
వడగళ్లకు నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. రూ.వేల కొద్ది పెట్టుబడులు పెట్టి నష్టపోయిన మాకు నష్టపరిహారం ఎందుకు ఇయ్యరని రైతులు ప్రశ్నిస్తున్నారు. సరైన సమయంలో రైతు బంధు ఇవ్వకపోతే అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారు. పంటల బీమా లేకపోవడంతో నష్టపోయిన పరిహారం అందడం లేదు. బ్యాంకులు పంట రుణాలు ఇచ్చే సమయంలో పంట బీమా చేసినా ఏ రైతుకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వడం లేదని వాపోతున్నారు.
18 ఏళ్లుగా గోదావరి నీళ్ల ముచ్చటే!
మెట్ట ప్రాంత రైతులకు కరువు దూరం చేయాలని 2007లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గౌరవెల్లి ప్రాజెక్టుకు పునాదులు వేశాడు. అప్పటికే 90 శాతం పనులు పూర్తి చేసినా మహానేత మరణంతో ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో ప్రాజెక్టుకు రీడిజైన్ చేసి 8 టీఎంసీల వరకు 2020లో పనులు పూర్తి చేశారు. అధికారులు ముంపునకు గురైన గుడాటిపల్లె, తెనుగుపల్లె, కొత్తపల్లితో పాటు నాలుగు గిరిజన తండాలను ఖాళీ చేయించి 2023 జూన్ 30న గౌరవెల్లి ప్రాజెక్టులోకి ట్రైయల్ రన్ చేసి గోదావరి నీళ్లు వస్తున్నాయని ఆశలు కల్పించారు. ఎన్జీటీలో కేసు ఉండటంతో పనులు నిలిపేయాలని స్టే ఇవ్వగా అధికారులు నిలిపేశారు. 2024 ఆగస్టులో ప్రాజెక్టు కుడి, ఎడుమ కాల్వల తవ్వకాల కోసం ప్రభుత్వం రూ.431 కోట్లు నిధులు మంజూరు చేయడంతో ప్రాజెక్టులోకి గోదావరి నీళ్లు వస్తాయని నాయకుల ప్రసంగాలతో రైతులకు భరోసా కల్పించారు. కాల్వల ద్వారా నీళ్లు రాకపోయినా ప్రాజెక్టులోకి గోదావరి నీళ్లు వస్తే బావుల్లో నీటి ఊటలు పెరిగుతాయని ఆశ పడ్డారు. 18 ఏళ్ల నుంచి గోదావరి నీళ్లు వస్తున్నాయనే నాయకుల మాటలే తప్ప ఇప్పటికీ నీళ్లు తీసుకరాలేదని రైతులు వాపోతున్నారు.
2 ఎకరాలు ఎండింది
వానాకాలం వరి కోతల వరకు వర్షాలు పడ్డాయని బావుల్లో నీళ్లు ఉంటే మూడు ఎకరాలు వరి వేసిన. ఉగాదికి ముందే ఊటలు వెనక్కి వెళ్లిపోవడంతో బాయి నీళ్లు అడుగంటిపోయి మొదటి మడి పారలేదు. వరుస తాళ్లు పెడితే ఒక ఎకరం పంట చేతుకి వచ్చింది. రెండు ఎకరాలు కళ్ల ముందే ఎండిపోతే పశువులకు మేతకు వదిలేసిన. రూ.45 వేలు పెట్టుబడి నష్టపోయిన ప్రభుత్వం మాకు పరిహారం ఇయ్యాలే.
– దేవేందర్ నాయక్, భల్లునాయక్ తండా
రూ.5 లక్షల వరకు నష్టం
గాంధీనగర్‌లో సొంత పొలంలో పశువులను పెంచి సేంద్రియ ఎరువు తయారుతోనే పంటలు సాగు చేస్తున్నా. ఎరువును ఇరుగు పొరుగు వారికి సరఫరా చేస్తా. 10 ఏళ్ల నుంచి ఎప్పుడూ చూడని కరువును ఇప్పుడు చూశా. రెండు బావులు, ఒక బోరు ఎండిపోతే రూ.1.50 లక్షలతో మరో 600 ఫీట్ల బోరు వేయించిన రూ.1.50 లక్షలతో మోటారు బిగిస్తే ఒక్క రోజులోనే ఎండిపోయింది. 3.20 ఎకరాల సేంద్రియ సన్నరకం వరి పంట ఎండిపోయింది. రూ.5 లక్షల వరకు నష్టం వచ్చింది. పశువుల మేతకు మరో దగ్గర నుంచి పశుగ్రాసం కొనుగోలు చేయాల్సి దుస్థితి వచ్చింది.
– మాదాడి రాజేశ్వర్‌రావు, గాంధీనగర్ హుస్నాబాద్

మాకేది పరిహారం?

మాకేది పరిహారం?

మాకేది పరిహారం?