
లింగయ్యను స్వదేశానికి రప్పించేందుకు కృషి
హుస్నాబాద్: దుబాయిలో చిక్కుకుపోయిన చొప్పరి లింగయ్యను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు కృషి చేస్తామని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి గాజుల సంపత్ కుమార్ తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో సోమవారం లింగయ్య ఇంటికి వెళ్లి అతడి భార్య రజితను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాల్లో ఉపాధి కల్పిస్తామని ఏజెంట్లు మోసం చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం లింగయ్య వద్ద వైద్య చేయించుకోవడానికి చిల్లి గవ్వ లేదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారన్నారు. సామాజిక సేవకులు సత్యం పటేల్, బాలరాజ్ గౌడ్, తిరుపతి రెడ్డి ఆదివారం లింగయ్యతోపాటు కంపెనీ యాజమాన్యాన్ని కలిసినట్లు తెలిపారు. తప్పకుండా లింగయ్యను తిరిగి స్వదేశానికి రప్పించి ఆయనకు ఉపాధి కల్పించేలా మంత్రి దృష్టికి తీసుకెళ్తామని సంపత్ కుమార్ తెలిపారు.