
గుప్త నిధుల కోసం తవ్వకాలు!
విశ్వనాథస్వామి ఆలయఆవరణలో భారీ గొయ్యి ● చైర్మన్‌పై భక్తుల ఆగ్రహం ● ఎమ్మెల్యే, పోలీసుల పరిశీలన ● పోలీసుల అదుపులో చైర్మన్
గొయ్యిని పరిశీలించిన ఎమ్మెల్యే
విషయం తెలుసుకొని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, వైస్ చైర్మన్ దారం శంకర్, మాజీ ఎంపీటీసీ పండరిరెడ్డి, నాయకులు అశోక్‌రెడ్డి గొయ్యిని పరిశీలించారు. ఆలయం ఆవరణలో అపారమైన నిధి ఉందని చైర్మన్ హన్మాండ్లు చెప్పేవారని కొందరు ఎమ్మెల్యేకు వివరించారు. కొత్త ఆలయ కమిటీ ఏర్పాటుకు నోటిఫికేషన్ రానున్న తరుణంలో ఘటన జరగడం, పరిస్థితులను బట్టి గుప్తనిధుల కోసమే తవ్వినట్లు ఎమ్మెల్యే అనుమానం వ్యక్తం చేశారు. త్వరగా కొత్త కమిటీ కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని దేవాదాయ, ధర్మాదాయశాఖ ఉన్నతాధికారులను ఫోన్ ద్వారా కోరారు. తవ్వకాల విషయంలో కేసు నమోదు చేసి సమగ్రవిచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎమ్మెల్యే సూచించారు.
నారాయణఖేడ్: ఖేడ్ పట్టణంలోని విశిష్ట చరిత్రగల ప్రాచీన కాశీ విశ్వనాథస్వామి ఆలయం ఆవరణలో గొయ్యి తవ్వకం కలకలం సృష్టించింది. గుప్త నిధుల కోసమేనని భక్తులు అనుమానం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కాశీ విశ్వనాథస్వామి ఆలయ ముఖద్వారం ఎదుట ఉన్న మండపానికి ఆనుకొని దాదాపు ఐదు అడుగుల లోతు, 10 అడుగుల వెడల్పుతో గొయ్యిని తవ్వారు. దానిపై పాత గేటు గ్రిల్ వేసి, గొయ్యి కనిపించకుండా ఉండేందుకు గడ్డి, చెట్ల పొదలతో కప్పి ఉన్న విషయాన్ని సోమవారం ఆలయానికి వచ్చిన భక్తులు గుర్తించారు. ఆలయ కమిటీ చైర్మన్ హన్మాండ్లును పిలిపించగా పూజకు వాడిన పూలను వేసేందుకు ఆదివారం తానే అడ్డా కూలీలతో తవ్వించినట్లు తెలపారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయంలో అధికారుల అనుమతి లేకుండా, కమిటీలోని ఇతర బాధ్యులకు తెలపకుండా ఎలా తవ్వించారని భక్తులు ప్రశ్నించారు. పూలను వేసేందుకై తే అంత పెద్ద గొయ్యి, అదీ మండపానికి ఆనుకొని దాని పునాదులు కూలే అవకాశం ఉండేలా తవ్వించడం.. పైగా కనపడకుండా పైన గ్రిల్‌పెట్టి పొదలతో కప్పిఉంచడంలో ఆంతర్యం ఏంటని భక్తులు నిలదీశారు. ఇద్దరు కూలీలతో తవ్వించినట్లు చెబుతుండగా నలుగురితోపాటు ఓ బాబా సైతం ఉన్నట్లు అక్కడున్న వారు చెప్పడంతో గుప్త నిధుల కోసమే తవ్వించారని భక్తులు ఆరోపించారు. విషయం తెలుసుకొని ఎస్సై–2 మెగులయ్య సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. విచారణ నిమిత్తం చైర్మన్ హన్మాండ్లును స్టేషన్‌కు తరలించారు.