
భూ కబ్జాలపై ఫిర్యాదు చేయండి
అక్కన్నపేట(హుస్నాబాద్): గ్రామాల్లో భూములు కబ్జాలకు గురైతే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. అక్కన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట భూ భారతి చట్టంలోని వివిధ అంశాలను అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ రైతులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రభుత్వ భూములను కాపాడుకోవాలన్నారు. ప్రభుత్వ భూములను కబ్జాలు చేసిన వారు ఎంతటి వారైన సహించబోమన్నారు.
రైతులకు వరం
భూమి అంటేనే ఆత్మగౌరవం అని, అలాంటి భూమి వివాదాల్లో ఉండటం.. తదితర అంశాల పరిష్కారానికి ‘భూ భారతి’ రైతులకు వరంలా ఉపయోగపడుతుందన్నారు. ధరణి వల్ల జరిగిన అవకతవకల వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35లక్షల మంది ఫిర్యాదు చేశారన్నారు. 30 ఏళ్ల క్రితం అమ్మిన భూమి ధరణిలో మళ్లీ పాత యజమాని పేరు వచ్చిందని... తద్వారా గొడవలు నెలకొన్నాయన్నారు. భూముల మీద పంచాయితీలు జరగకుండా ఉండాలన్నదే మా లక్ష్యమన్నారు. త్వరలోనే గౌరవెల్లి కాలువల నిర్మాణం పూర్తవతుందని, ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందిస్తామన్నారు. అలాగే నష్టపోయిన రైతులను అందుకుంటామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ మనుచౌదరి, ఆర్డీఓ రామ్మూర్తి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య తదితరులు పాల్గొన్నారు.
మంత్రి దృష్టికి భూ సమస్యలు
భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు ముగిసిన తరువాత పలువురు రైతులు భూ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అక్కన్నపేట మండలంలోని నందారం గ్రామ రెవెన్యూ పరిధిలో సుమారు 935ఎకరాల వరకు వ్యవసాయ భూములు ఓ ముస్లిం పేరుపై ఉండటంతో ధరణీ పోర్టల్‌లో నిషేధిత జాబితాలోకి వెళ్లాయని భానోతు భాస్కర్‌నాయక్ చెప్పారు. మోత్కులపల్లి పరిధిలో సుమారు 120ఎకరాల భూమి ఎస్సీ, ఎస్టీ, బీసీ కులస్తులకు పశువులు, మేకలు మేపుటకు అప్పటి దొరలు ఇస్తే ఇతరులు పట్టాలు చేసుకున్నారని గుగులోతు రాంబాబు నాయక్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రేగొండలో ఏళ్లతరబడి కాస్తులో ఉంటే ధరణిలో మరొకరి పేరు ఉందని ఎడల వనేష్ చెప్పారు. ఇలా పలువురు భూ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ధరణి పోర్టల్‌ను ప్రస్తుతం బంగాళాఖాతంలో కలిపేశామన్నారు. భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భరోసా ఇచ్చారు.
జూన్ 2 నుంచి క్షేత్ర స్థాయిలో అమలు
హుస్నాబాద్: వచ్చే జూన్ 2 నుంచి భూ భారతి చట్టం క్షేత్ర స్థాయిలో అమలు అవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మండలంలోని పొతారం (ఎస్)లో గురువారం భూ భారతి చట్టం అవగాహన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ధరణి వచ్చిన తర్వాతే భూముల పంచాయితీ పెరిగిందన్నారు. భూమి ఎవరిదో తెలిపేలా సమగ్ర వివరాలతో భూ భారతి చట్టం తెచ్చామన్నారు. కోర్టుల వరకు పోవాల్సిన అవసరం లేదని, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్‌ల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.
భూ భారతితో కష్టాలు తొలగిస్తాం
భూముల పేరిట పంచాయితీలు వద్దు
అవగాహన సదస్సులో మంత్రి పొన్నం

భూ కబ్జాలపై ఫిర్యాదు చేయండి