
నెరవేరుతున్న సొంతింటి కల
● సంతోషంలో ఇందిరమ్మ లబ్ధిదారులు ● ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ ● సిద్దిపేటలో ఇళ్ల పరిశీలన
పేద ప్రజల అభివృద్ధే ముఖ్యం
సిద్దిపేటకమాన్: పేదల సొంతింటి కల నెరవేరుతుండటంతో ఇందిరమ్మ లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 37వ వార్డులో నిర్మాణంలో ఉన్న పలు ఇందిరమ్మ ఇళ్లను మంత్రి మంగళవారం పరిశీలించారు. నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పదేళ్లలో డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో పేదలను ఊరించిందేకాని, ఎక్కడా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. నేడు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ముఖాల్లో సొంత ఇల్లు నిర్మించుకుంటున్నామనే సంతోషం కనిపిస్తోందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృథా చేసిందన్నారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టులు నిర్మించారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో నాయకులు ఇష్టారీతినా భవనాలు నిర్మించారని మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం పనిచేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిర్మాణం పూర్తయ్యే సరికి విడతల వారీగా డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతాయన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, ఆర్డీఓ, తహశీల్దార్, నియోజకవర్గ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ, వార్డు కౌన్సిలర్ సాకి బాల్‌లక్ష్మి, మార్క సతీష్, శ్రీనివాస్, అత్తు, ముద్దం లక్ష్మి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
సిద్దిపేటఅర్బన్: రాష్ట్రంలోని ప్రతి పేద వారు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వివేక్ అన్నారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్సాన్‌పల్లిలో 127 ఇండ్లు మంజూరు కాగా 90 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయని, మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. లబ్ధిదారులు క్వాలిటీతో ఇళ్ల నిర్మాణాలను చేసుకుంటున్నారని అభినందించారు. గత బీఆర్‌ఎస్ పాలనలో పేద ప్రజలకు స్వంత ఇంటి కల నెరవేరలేదన్నారు.
మున్సిపల్ కమిషనర్‌పై మంత్రి సీరియస్..
మున్సిపల్ నిధుల విషయంలో కాంగ్రెస్ కౌన్సిలర్లకు సహకరించడం లేదని నాయకులు కమిషనర్ ఆశ్రిత్‌కుమార్‌పై మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి కమిషనర్‌పై సీరియస్ అయ్యారు. తనకు తెలియకుండా ఎలాంటి కేటాయింపులు చేయవద్దని ఆదేశించారు.