Kuwait: 46 runs in a single over, unthinkable feat happens in T20 Franchise League - Sakshi
Sakshi News home page

#OneOver46 Runs: ఒక్క ఓవర్‌లో 46 పరుగులు.. క్రికెట్‌ చరిత్రలో తొలిసారి

Published Thu, May 4 2023 5:46 PM | Last Updated on Thu, May 4 2023 6:01 PM

46 Runs-Single-Over-Unthinkable-Feat-Happen-T20 Franchise League-Kuwait - Sakshi

క్రికెట్‌లో ఒక్క ఓవర్‌లో సాధారణంగా అత్యధికంగా ఎన్నిపరుగులు వస్తాయంటే టక్కున వచ్చే సమాధానం 36. అది కూడా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదితే ఈ ఫీట్‌ నమోదవుతుంది. ఒకవేళ​ మరో నోబాల్‌.. లేదా వైడ్‌ వెళితే కొన్ని పరుగులు జత అవుతాయి. అది కూడా అరుదుగా జరుగుతుంది.

అందుకే 36 పరుగులే ఇప్పటివరకు చాలాసార్లు అత్యధికంగా ఉంది. కానీ ఒక్క ఓవర్‌లో 46 పరుగులు వచ్చాయంటే మీరు నమ్ముతారా.. అంత లేదు అని తేల్చేస్తాం. కానీ ఒక్క ఓవర్‌లో 46 పరుగులు బాదిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. ఊహించుకోవడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

అరుదైన దృశ్యం..
కువైట్‌ వేదికగా జరిగిన కేసీసీ ఫ్రెండ్స్‌ మొబైల్‌ టి20 ఛాంపియన్స్‌ ట్రోఫీ 2023లో ఇది జరిగింది. ఎన్‌సీఎమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ వర్సెస్‌ టాలీ సీసీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్బుతం ఆవిష్కృతమైంది. ఎన్‌సీఎమ్‌ బ్యాటర్‌ వాసు.. టాలీ సీసీ బౌలర్‌ హర్మన్‌ ఓవర్‌ను చితకబాది 46 పరుగులు రాబట్టాడు. తొలి బంతిని నోబాల్‌ వేయగా సిక్సర్‌ బాదాడు. దీంతో ఏడు పరుగులు వచ్చాయి.

ఆ తర్వాత ఫ్రీహిట్‌కు నాలుగు పరుగులు బైస్‌ రూపంలో వచ్చాయి.  ఒక్క బంతి కరెక్ట్‌ వేయగా 11 పరుగులు వచ్చాయి. ఆ తర్వాతి ఐదు బంతులను ఐదు సిక్సర్లు కొట్టగా ఇందులో ఒక నోబ్‌ సహా మొత్తం 31 పరుగులు వచ్చాయి. దీంతో ఐదు బంతుల్లో స్కోరు 42గా మారింది. ఇక ఆఖరి బంతిని బౌండరీ రావడంతో అలా ఆరు బంతుల్లో 46 పరుగులు వచ్చాయి. క్రికెట్‌ చరిత్రలో ఒకే ఓవర్‌లో 46 పరుగులు రావడం ఇదే తొలిసారి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వన్డేల్లో 36.. టెస్టుల్లో 35.. టి30ల్లో 36.. ఐపీఎల్‌లో 37..
ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు వన్డేల్లో ఒక్క ఓవర్‌లో 36 పరుగులు అత్యధికంగా ఉంది. 2006లో సౌతాఫ్రికా ఓపెనర్‌ గిబ్స్‌ నెదర్లాండ్స్‌పై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదగా.. 2021లో అమెరికా బ్యాటర్‌ జస్కరన్‌ మల్హోత్రా పపువా న్యూ గినియాపై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది 36 పరుగులు రాబట్టాడు.

ఇక టెస్టుల్లో 2022లో ఇంగ్లండ్‌పై టీమిండియా బౌలర్‌ బుమ్రా కొట్టిన 35 పరుగులు ఇప్పటివరకు ఒక్క ఓవర్‌లో అత్యధికంగా ఉంది. ఇక టి20ల్లో ఒక్క ఓవర్‌లో అత్యధిక పరుగులు రెండుసార్లు నమోదయ్యాయి. తొలిసారి 2007లో యువరాజ్‌ ఇంగ్లండ్‌పై 36 పరుగులు(ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు), 2021లో విండీస్‌ హిట్టర్‌ పొలార్డ్‌ శ్రీలంకపై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది 36 పరుగులు రాబట్టాడు.

ఇక ఐపీఎల్‌లో ఒక్క ఓవర్‌లో అత్యధిక పరుగులు 37గా ఉంది. తొలిసారి 2011లో ఆర్‌సీబీతో మ్యాచ్‌లో కొచ్చి టస్కర్స్‌ బౌలర్‌ పి. పరమేశ్వరన్‌ ఒక్క ఓవర్‌లో 37 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత 2021లో ఆర్‌సీబీ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఒక్క ఓవర్‌లో 37 పరుగులు ఇచ్చుకోవడం గమనార్హం.

చదవండి: గమనించారా.. మ్యాచ్‌తో పాటు పాత పగను కూడా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement