భారత టీ20 కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఎంపికైన సంగతి తెలిసిందే. జూలై 26 నుంచి శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌తో టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ ప్రస్థానం మొదలు కానుంది. అయితే ఇకపై సూర్య కేవలం టీ20ల్లో మాత్రమే భారత జెర్సీలో కన్పించే అవకాశముంది.
ఎందుకంటే టీ20ల్లో అద్బుతమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్న సూర్యకుమార్.. వన్డేలు, టెస్టుల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. గతేడాది వన్డే వరల్డ్‌కప్ రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో సైతం సూర్య సభ్యునిగా ఉన్నాడు.
కానీ మిస్టర్ 360 టోర్నీలో దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పటివరకు 37 వన్డేలు ఆడిన ఈ ముంబైకర్ కేవలం 773 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలోని అతడిని కేవలం టీ20లకే పరిమితం చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీతో పాటు కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో సూర్యకుమార్ యాదవ్ ఆడే అవకాశం లేదని చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా జరగనుంది. అయితే భారత్ పాల్గోంటుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు.
"గతేడాది వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరిన భారత జట్టులో సూర్యకుమార్ భాగంగా ఉన్నాడు. అదే విధంగా టీ20 వరల్డ్‌కప్-2024 విజేతగా నిలిచిన జట్టులోనూ సూర్య సభ్యునిగా ఉన్నాడు. డేవిడ్ మిల్లర్ క్యాచ్‌ను అద్భుతంగా అందుకుని భారత్‌ను ఛాంపియన్స్‌గా నిలిపాడు.
అంతేకాకుండా టీ20ల్లో దాదాపు ఏడాది పాటు వరల్డ్‌నెం1గా కొనసాగాడు. కానీ ఇటువంటి అద్భుత ఆటగాడికి వన్డేల్లో మాత్రం చోటు దక్కడం కష్టమనే చెప్పుకోవాలి. ఇకపై సూర్య టీ20ల్లో మాత్రమే కొనసాగనున్నాడు.
ఇదే విషయాన్ని బీసీసీఐ ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. అంటే వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో సూర్య ఆడడని ఆర్దం చేసుకోవచ్చు" అని తన యూట్యూబ్ ఛానల్‌లో ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment